స్టార్ పుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఆటకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. రొనాల్డో ఆటగాడిగా మైదానంలోనే కాక.. తనకున్న అశేషమైన అభిమానగణంతో బయట కూడా ఎంతో ప్రభావం చూపగలడు. అందుకు తాజాగా జరిగిన ఓ సంఘటనే ఉదాహరణ.
యూరో కప్ సాకర్ టోర్నీలో బాగంగా ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్న రొనాల్డో.. తన కుర్చీముందు టేబుల్‌పై ఉంచిన రెండు కోకాకోలా బాటిళ్లను పక్కకి పట్టాడు. అదే క్రమంలో పక్కనే ఉన్న మంచినీళ్ల బాటిల్ పైకెత్తి చూపించి.. నీళ్లే మంచివి అన్న తరహాలో సంజ్ఞ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. అంతర్జాతీయ మార్కెట్లో కోకాకోలా షేర్ వాల్యూ ఘోరంగా పతనమైంది.
ఏకంగా కోకాకోలా కంపెనీకి రూ.29 వేల కోట్ల నష్టం వాటిల్లింది. కొసమెరుపు ఏమిటంటే.. యూరో కప్ ను స్పాన్సర్ ను చేస్తున్న అంతర్జాతీయ సంస్థల్లో కోకాకోలా కూడా వుంది. అయితే.. దీనిపై స్పందించిన కోకాకోలా.. ఎవరికి నచ్చిన పానీయాలు వారు తాగుతారని పేర్కొంది. ప్రెస్ మీట్ లలో కోకాకోలా డ్రింక్ లు కూడా అందుబాటులో ఉంచుతామని.. పలువురు ఆటగాళ్లు కోకాకోలా డ్రింక్ తాగడం చూసే ఉంటారని పేర్కొంది.