'ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి'.. ఓట‌మిని లైట్‌గా తీసుకున్న రోహిత్‌..!

బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో భారత జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

By Kalasani Durgapraveen  Published on  20 Oct 2024 2:51 PM IST
ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి.. ఓట‌మిని లైట్‌గా తీసుకున్న రోహిత్‌..!

బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో భారత జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. తొలి టెస్టులో ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ ఓటమి తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పెద్దగా ఆందోళన చెందలేదు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మ్యాచ్‌లు జరుగుతాయని అభిప్రాయపడ్డాడు.

ఈ మ్యాచ్‌లో తొలి రోజు వర్షం కారణంగా రద్దయింది. రెండో రోజు టాస్ గెలిచిన రోహిత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్‌ పరిస్థితులను సద్వినియోగం చేసుకున్న కివీస్ బౌలర్లు భారత్‌ను తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 46 పరుగులకే కట్టడి చేశారు. తాను తప్పు చేశానని.. మొదట బ్యాటింగ్ చేయకూడదని రోహిత్ రెండో రోజు తర్వాత అంగీకరించాడు.

మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ.. టీమిండియా స్వదేశంలో గతంలో ఓడిపోయిందని,.. ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయని అన్నాడు. రోహిత్ మాట్లాడుతూ.."మొన్నటి రోజు విలేకరుల సమావేశంలో నేను చెప్పాను, ఇది సవాలుతో కూడిన మ్యాచ్ అని మాకు తెలుసు, మేము 46 పరుగులకు ఆలౌట్ అవుతాం అని మేము అనుకోలేదు.. అయితే దీని క్రెడిట్ న్యూజిలాండ్‌కు చెందుతుంది. ఆ నిర్ణ‌యం మనల్ని వెనక్కు తీసుకువెళ్లింది.. అయితే భవిష్యత్తులో కూడా ఇలాంటి మ్యాచ్‌లు జరుగుతాయి. ఇంతకుముందు కూడా స్వదేశంలో పరాజయాలు ఎదుర్కొన్నాం.. ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి.. మరో రెండు టెస్టు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి.. ఏం చేయాలో మాకు తెలుసు.. వచ్చే రెండు మ్యాచ్‌ల్లో బాగా రాణిస్తామని రోహిత్ అన్నాడు.

భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో కూడా కష్టతరమైన స్థితిలో కనిపించింది, అయితే సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ 177 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ద్వారా జట్టును పటిష్ట స్థితిలో ఉంచారు. సర్ఫరాజ్ తన తొలి టెస్టు సెంచరీ సాధించి 150 పరుగులు చేశాడు. పంత్ సెంచరీని కోల్పోయి 99 పరుగుల వద్ద ఔటయ్యాడు. వీరిద్దరినీ రోహిత్ చాలా మెచ్చుకున్నాడు.

రోహిత్ మాట్లాడుతూ.. పంత్, సర్ఫరాజ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు.. అందరూ తమ సీట్ల నుండి పదే పదే లేచారు. పంత్ చాలా పరిణతి చెందిన ఇన్నింగ్స్ ఆడాడు. అతను చాలా కాలంగా ఇలా ఆడుతున్నాడు. అతను తన షాట్లను ఆడాడు. తన మూడవ ఇన్నింగ్స్‌లోనే సర్ఫరాజ్ చాలా తెలివైన ఇన్నింగ్స్ ఆడాడు అని కొనియాడాడు.

Next Story