కోహ్లీకి షాక్‌.. వ‌న్డే కెప్టెన్‌గా రోహిత్‌

Rohit Sharma Named India's White-ball Captain.అంద‌రూ ఊహించిందే నిజం అయింది. ప‌రిమిత ఓవ‌ర్ల కెప్టెన్‌గా కోహ్లీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Dec 2021 8:12 AM IST
కోహ్లీకి షాక్‌.. వ‌న్డే కెప్టెన్‌గా రోహిత్‌

అంద‌రూ ఊహించిందే నిజం అయింది. ప‌రిమిత ఓవ‌ర్ల కెప్టెన్‌గా కోహ్లీ రికార్డు పేల‌వంగా ఏమీ లేక‌పోయినా.. ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా అందించ‌క‌పోవ‌డంతో విరాట్ సామర్థ్యంపై ప్ర‌శ్నలు ఎదుర‌వుతున్న త‌రుణంలో సెల‌క్ట‌ర్లు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. కొద్ది రోజుల క్రిత‌మే టీ20 కెప్టెన్సీకి రాజీనామా చేసిన కోహ్లీకి షాక్ ఇస్తూ.. వ‌న్డే కెప్టెన్సీ నుంచి కూడా త‌ప్పించారు. రెండు సంవ‌త్స‌రాల్లో రెండు ప్ర‌పంచ‌క‌ప్‌లు(ఒక టీ20, ఒక వ‌న్డే) ఉన్న త‌రుణంలో రెండింటికి ఒకే సార‌థి ఉంటే బాగుంటుంద‌ని బావించిన బీసీసీఐ.. వ‌న్డేల్లోనూ రోహిత్‌కు ప‌గ్గాలు అప్ప‌గించింది. 2023 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ వ‌ర‌కు రోహిత్ 50 ఓవ‌ర్ల ఫార్మాట్‌కు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.

టెస్టుల విషయానికొస్తే కోహ్లీ సార‌ధ్యంలోనే టీమ్ఇండియా ఆడ‌నుంది. అయితే.. గ‌త కొంత‌కాలంగా ఫేల‌వ‌ఫామ్‌తో స‌త‌మ‌తమ‌వుతున్న ర‌హానేను వైస్‌ కెప్టెన్సీ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించింది. టెస్టుల‌కు వైస్ కెప్టెన్‌గా రోహిత్‌ను నియ‌మించింది. దీంతో త్వ‌ర‌లోనే భార‌త్‌కు పూర్తిస్థాయి కెప్టెన్‌గా రోహిత్‌ను చూసే అవ‌కాశం ఉంది. అంతేకాకుండా ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు భార‌త టెస్టు జ‌ట్టును ఎంపిక చేశారు. మూడు టెస్టుల సిరీస్‌ కోసం బీసీసీఐ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

టెస్టు సిరీస్‌కు సెల‌క్ష‌న్ క‌మిటీ 18 మంది స‌భ్యుల‌తో కూడిన జ‌ట్టును ప్ర‌క‌టించింది. ఆల్‌రౌండ‌ర్ జ‌డేజా, అక్ష‌ర్ ప‌టేల్‌, ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్ గాయాల‌తో జ‌ట్టుకు దూరం అవ్వ‌గా.. సీనియ‌ర్ ఆట‌గాళ్లు ర‌హానే, పూజారాల‌కు మ‌రో అవ‌కాశం ఇచ్చింది. కివీస్‌తో సిరీస్‌కు ప‌క్క‌న పెట్టిన హ‌నుమ విహారి పున‌రాగ‌మ‌నం చేశాడు. వికెట్ కీప‌ర్‌గా కేఎస్ భ‌ర‌త్ ఆక‌ట్టుకున్న‌ప్ప‌టికీ రెండో వికెట్ కీప‌ర్‌గా సాహాపై సెల‌క్ట‌ర్లు మ‌రోసారి విశ్వాసం ఉంచారు. పేల‌వ ఫామ్‌తో ఇబ్బందులు ప‌డుతున్న ఇషాంత్ కు మ‌రో అవ‌కాశం ల‌భించింది. ప్ర‌స్తుతం ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న భార‌త‌-ఏ జ‌ట్టు పేస్ బౌల‌ర్లు న‌వ‌దీప్ సైనీ, దీప‌క్ చాహ‌ర్‌, అర్జాన్ న‌గ్వాస్‌వాలా, స్పిన్న‌ర్ సౌర‌భ్ కుమార్‌లు స్టాండ్ బైలుగా ఎంపిక‌య్యారు.

భార‌త టెస్టు జట్టు: కోహ్లీ(కెప్టెన్‌), రోహిత్‌(వైస్‌ కెప్టెన్‌), కేఎల్ రాహుల్‌, మయాంక్ అగ‌ర్వాల్‌, పుజార, రహానే, అయ్యర్‌, విహారి, పంత్‌, సాహా, అశ్విన్‌, జయంత్‌, ఇషాంత్‌, షమీ, బుమ్రా, శార్దుల్‌, సిరాజ్‌

స్టాండ్ బై ఆట‌గాళ్లు : న‌వ‌దీప్ సైనీ, దీప‌క్ చాహ‌ర్‌, అర్జాన్ న‌గ్వాస్‌వాలా, సౌర‌భ్ కుమార్‌

Next Story