భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లీ, పాకిస్తాన్ స్టార్ బాబర్ ఆజం కంటే మెరుగైన బ్యాటర్ అని పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ అబ్దుర్ రౌఫ్ ఖాన్ చెప్పుకొచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో బాబర్ ఎదుగుదలను పాకిస్తాన్ అభిమానులు విరాట్ కోహ్లీతో పోల్చారు. కానీ బాబర్ లో విరాట్ లోని సత్తా లేదని కొన్ని నెలలకే పాక్ అభిమానులకు కూడా తెలిసిపోయింది.
ఇటీవల అబ్దుర్ రౌఫ్ ఖాన్ ఇద్దరు బ్యాటర్ల మధ్య పోటీపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు. విరాట్ కోహ్లీకి బాబర్ ఆజమ్ కు ఎటువంటి పోలిక లేదని అంగీకరించాడు. అయితే రోహిత్ శర్మ.. కోహ్లీ, బాబర్ కంటే కూడా మెరుగైన ఆటగాడని ప్రశంసలు కురిపించాడు.
“ఇద్దరూ గొప్ప ఆటగాళ్లు, కానీ నా అభిప్రాయం ప్రకారం, విరాట్ కోహ్లీకి బాబర్ తో పోలిక లేదు. అతని క్లాస్, నిలకడ, ఒత్తిడిలో ఆడే సామర్థ్యం అతనిని ఇతర ఆటగాళ్లతో వేరు చేసింది. వ్యక్తిగతంగా నాకు ఇష్టమైన బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ. రోహిత్ ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటర్ అని నేను నమ్ముతున్నాను ”అని అబ్దుర్ రౌఫ్ ఖాన్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో అన్నాడు.
రోహిత్ శర్మ సెప్టెంబరు 2024 నుండి పేలవమైన ఫామ్‌తో కొనసాగుతున్నాడు. టెస్ట్ సీజన్‌లో ఎనిమిది మ్యాచ్‌లలో 10.93 సగటుతో కేవలం ఒక అర్ధ సెంచరీతో 164 పరుగులు మాత్రమే చేశాడు. ఎట్టకేలకు ఇంగ్లండ్‌తో జరిగిన ఇటీవలి సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో 12 ఫోర్లు, ఏడు సిక్సర్‌లతో 119 (90) పరుగులు చేశాడు. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న సెంచరీని సాధించి ఛాంపియన్స్ ట్రోఫీ ముందు ఫామ్ ను సొంతం చేసుకున్నాడు.