అరంగ్రేట టెస్టులో శ్రేయాస్ శ‌త‌కం.. రోహిత్‌, అయ్య‌ర్‌ల డ్యాన్స్ వీడియో వైర‌ల్‌

Rohit Sharma Celebrates Shreyas Iyer’s Debut Century With A Dance Clip.కాన్పూర్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Nov 2021 6:17 AM GMT
అరంగ్రేట టెస్టులో శ్రేయాస్ శ‌త‌కం.. రోహిత్‌, అయ్య‌ర్‌ల డ్యాన్స్ వీడియో వైర‌ల్‌

కాన్పూర్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో శ్రేయాస్ అయ్య‌ర్ శ‌త‌కంతో(105; 171 బంతుల్లో 13 పోర్లు, 2 సిక్స‌ర్లు) స‌త్తా చాటిన సంగ‌తి తెలిసిందే. అరంగ్రేటం మ్యాచ్‌లో సెంచ‌రీ సాధించిన భార‌త 16వ ఆట‌గాడిగా అయ్య‌ర్ రికార్డుల‌కెక్కాడు. తొలి టెస్ట్ లోనే న్యూజిలాండ్ పై శతకం బాదిన మూడో ఆటగాడిగా.. అలాగే అరంగేట్ర మ్యాచ్ లోనే శ‌త‌కం సాధించిన మూడో పిన్న వయస్కుడిగా అయ్యర్ నిలిచాడు. ఈ నేప‌థ్యంలో ప‌లువురు దిగ్గ‌జ క్రికెట‌ర్లు అయ్య‌ర్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

భార‌త టీ20 కెప్టెన్‌, హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ త‌న‌దైన శైలిలో శుభాకాంక్ష‌లు తెలియ‌జేశాడు. అద్భుతంగా ఆడావు. టెస్టు కెరీర్‌ను చాలా ఘ‌నంగా ప్రారంభించావు అంటూ రాసుకొచ్చిన రోహిత్‌.. అయ్య‌ర్‌, శార్దుల్ ల‌తో క‌లిసి తాను గ‌తంలో డ్యాన్స్ చేసిన వీడియోను పంచుకున్నాడు. ఈ వీడియోలో శ్రేయస్‌ ముందుండి డ్యాన్స్‌ చేయగా.. రోహిత్‌, శార్దూల్‌ అతడిని అనుకరిస్తూ స్టెప్పులేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. పోస్టు చేసిన‌ రెండు గంటల్లోపే 7లక్షలకు పైగా లైకులు రావడం విశేషం.

రోహిత్‌తో పాటు క్రికెట్ దేవుడ స‌చిన్‌, విరాట్ కోహ్లీ, వీవీల‌క్ష్మ‌ణ్ త‌దిత‌రులు శ్రేయాస్‌ను ప్ర‌శంసించిన వారిలో ఉన్నారు.

ఒత్తిడిలో చాలా చ‌క్క‌గా ఆడావు శ్రేయాస్‌. నిల‌క‌డ‌గా ఆడుతూ గొప్ప ప‌రిణితి చూపించావు. అరంగ్రేటం టెస్టులోనే సెంచ‌రీ చేసిన 16వ బ్యాట‌ర్‌గా రికార్డుల్లోకెక్కావు. ఇలాంటి శ‌త‌కాలు ఎన్నో సాధించాలి అని వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ ట్వీట్ చేశాడు.

టెస్టు కెరీర్‌ను గొప్ప‌గా ఆరంభించావు అయ్య‌ర్‌. టీమ్ఇండియా టెస్టు క్రికెట్‌లో నువ్వు భాగ‌మైనందుకు సంతోషంగా ఉంది అని స‌చిన్ టెండూల్క‌ర్ అన్నారు.

Next Story
Share it