రోహిత్ శ‌ర్మ ఖాతాలో స‌రికొత్త ప్ర‌పంచ రికార్డు

Rohit Sharma becomes first captain to record 13 successive T20I wins.భార‌త జ‌ట్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ టి20 ఫార్మాట్‌లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 July 2022 9:31 AM GMT
రోహిత్ శ‌ర్మ ఖాతాలో స‌రికొత్త ప్ర‌పంచ రికార్డు

భార‌త జ‌ట్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ టి20 ఫార్మాట్‌లో ప్ర‌పంచ‌రికార్డును సృష్టించాడు. ఈ పార్మాట్‌లో వ‌రుస‌గా 13 విజ‌యాలు అందుకున్న తొలి కెప్టెన్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్‌తో గురువారం సౌతాంప్ట‌న్ వేదిక‌గా జ‌రిగిన తొలి టి20లో టీమ్ఇండియా 50 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించ‌డంతో రోహిత్ ఖాతాలో ఈ రికార్డు వ‌చ్చి చేరింది. గ‌తంలో ఏ జ‌ట్టు కెప్టెన్‌గా కూడా ఇన్ని మ్యాచుల్లో విజ‌యాలు సాధించ‌లేదు.

2021 టి20 ప్ర‌పంచ‌క‌ప్ అనంత‌రం విరాట్ కోహ్లీ నుంచి రోహిత్ టీమ్ఇండియా సార‌థ్య బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్నాడు. స్వ‌దేశంలో న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌, శ్రీలంక జట్లతో జరిగిన మ్యాచ్‌లలో హిట్‌మ్యాన్ కెప్టెన్సీలో టీమ్ఇండియా గెలుపొందిన సంగతి తెలిసిందే. క్లీన్‌స్వీప్‌లతో ప్రత్యర్థి జట్లకు దడ పుట్టించింది.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 198 పరుగులు చేసింది. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా (51; 33 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్‌), సూర్యకుమార్‌ యాదవ్‌ (39; 19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), దీపక్‌ హుడా (33; 17 బంతులోల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) లు రాణించారు. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో మోయిన్ అలీ, జోర్డాన్ చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. అనంత‌రం 199 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి ఇంగ్లాండ్ కు శుభారంభం ద‌క్క‌లేదు.

తొలి ఓవ‌ర్‌లోనే కెప్టెన్ బ‌ట్ల‌ర్‌(0) ను భువ‌నేశ్వ‌ర్ కుమార్ పెవిలియ‌న్ చేర్చ‌గా.. ఆ త‌రువాత మ‌ల‌న్‌(21), లివింగ్ స్ట‌న్‌(0), జేస‌న్ రాయ్‌(4)ల‌ను హార్థిక్ పాండ్య ఔట్ చేసి మ్యాచ్‌ను భార‌త్ వైపు తిప్పాడు. మోయిన్ అలీ(36; 20 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), హ్యారీ బ్రూక్‌(28; 23 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌) పోరాడిన ఫ‌లితం లేక‌పోయింది. వీరి పోరాటం ఓట‌మి అంత‌రాన్ని త‌గ్గిచ‌డానికి మాత్ర‌మే ఉప‌యోగ‌ప‌డింది. వీళ్లిద్ద‌రి చాహ‌ల్ ఒకే ఓవ‌ర్ లో ఔట్ చేయ‌డంతో ఇంగ్లాండ్ ఆశ‌లు గ‌ల్లంతు అయ్యాయి. చివ‌రికి ఇంగ్లాండ్ 19.3 ఓవ‌ర్ల‌లో 148 ప‌రుగుల‌కే ఆలౌటైంది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది భార‌త్‌. ఇరు జ‌ట్ల మ‌ధ్య శ‌నివారం రెండో టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

Next Story