మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్న హిట్‌మ్యాన్

టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ తన పేరిట కొత్త రికార్డును లిఖించుకున్నాడు.

By Srikanth Gundamalla  Published on  23 Oct 2023 5:00 PM IST
rohit sharma, another record, cricket, india,

 మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్న హిట్‌మ్యాన్

భారత్ వేదికగా వన్డే వరల్డ్‌ కప్‌ టోర్నీ కొనసాగుతోంది. ఈ టోర్నీలో టీమిండియా విజయపరంపర కొనసాగిస్తోంది. మాకెవరు అడ్డు లేరు అన్నట్లుగా దూసుకుపోతుంది. భారత ఆటగాళ్లు కూడా అందరూ ఫామ్‌లో ఉన్నారు. అటూ బౌలింగ్‌లో.. ఇటు బ్యాటింగ్.. ఫీల్డింగ్‌లోనూ అద్భుతంగా రాణిస్తున్నారు. దాంతో.. ఈసారి కప్‌ మనదే అనేలా ఉంది టీమిండియా విజయాల జోరు. అంతేకాదు..భారత ఆటగాళ్లు ఈ టోర్నీలో ఒక్కో మ్యాచ్‌లో ఒక్కో రికార్డును తిరగరాస్తున్న విషయం తెలిసిందే. తాజాగా.. టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ తన పేరిట కొత్త రికార్డును లిఖించుకున్నాడు.

అక్టోబర్ 22న ఆదివారం ధర్మశాల వేదికగా న్యూజిలాండ్, భారత్‌ మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. విరాట్‌ కోహ్లీ చివరి వరకు నిలబడి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. అంతకుముందు రోహిత్‌ శర్మ కూడా అద్భుమైన ఇన్నింగ్స్ ఆడాడు. మంచి ఓపెనింగ్‌ అందించాడు. 274 పరుగుల టార్గెట్‌తో గ్రౌండ్‌లోకి దిగిన భారత్ విజయం సాధించింది. హిట్‌మ్యాన్‌ 46 పరుగులతో రాణించాడు. 4 ఫోర్లు.. 4 సిక్సర్లతో కివీస్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టేశాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ కొట్టిన 4 సిక్స్‌లతో అరుదైన ఘనతను సాధించాడు.

అంతర్జాతీయ వన్డేల్లో రోహిత్‌ శర్మ ఒక క్యాలెండర్ ఇయర్‌లో 50కి పైగా ఎక్కువ సిక్స్‌లో కొట్టిన ఆటగాళ్ల జాబితాలో నిలిచాడు. రోహిత్‌ శర్మ ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 53 సిక్స్‌లు కొట్టాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన వారి జాబితాలో రోహిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు. హిట్‌మ్యాన్‌ కంటే ముందు దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ (58 సిక్స్‌లు) తొలి స్థానంలో ఉండగా, వెస్టిండీస్‌ లెజెండ్ క్రిస్‌ గేల్‌ (56 సిక్స్‌లు)తో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే.. హిట్‌మ్యాన్‌ ఫామ్‌ చాలా బాగుందని.. మొదటి స్థానానికి చేరుకునేందుకు రోహిత్‌ శర్మకు పెద్దగా సమయం పట్టదని ఆయన అభిమానులు అంటున్నారు.

Next Story