పిచ్ అర్థం కావడం లేదు : రోహిత్ శర్మ

2024 టీ20 ప్రపంచకప్‌కు అమెరికా, వెస్టిండీస్‌ ఆతిథ్యమిస్తున్నాయి. ఐర్లాండ్‌ను ఓడించి భారత్ టోర్నీలో శుభారంభం చేసింది.

By Medi Samrat  Published on  6 Jun 2024 3:43 AM GMT
పిచ్ అర్థం కావడం లేదు : రోహిత్ శర్మ

2024 టీ20 ప్రపంచకప్‌కు అమెరికా, వెస్టిండీస్‌ ఆతిథ్యమిస్తున్నాయి. ఐర్లాండ్‌ను ఓడించి భారత్ టోర్నీలో శుభారంభం చేసింది. బుధవారం న్యూయార్క్‌లోని నసావు కౌంటీ స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మ పిచ్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 16 ఓవర్లలో 96 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 12.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ 37 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 52 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. అయితే అతను ఇన్నింగ్సు మ‌ధ్య‌లో రిటైరయ్యాడు.

మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ.. కొత్త మైదానం, కొత్త వేదిక.. ఇక్కడ ఆడటం ఎలా ఉంటుందో చూడాలనుకున్నాం. పిచ్ ఇంకా స్థిరపడలేదని.. అందుకే అర్థం కావడం లేదు.. పిచ్ నుంచి ఏం ఆశించాలో తెలియ‌డం లేదు.. అయితే.. బౌలర్లకు చాలా సాయ‌ప‌డుతుంద‌ని నేను భావిస్తున్నాను. అటువంటి పరిస్థితితుల‌లో బౌల‌ర్లు ప్రాథమిక అంశాలకు కట్టుబడి ఉండాలి. టెస్ట్ మ్యాచ్ త‌ర‌హా బౌలింగ్ గుర్తుంచుకోవడం ముఖ్యం అన్నాడు.

కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్‌ల ముందు బంతిని స్వింగ్ చేస్తూ లయను సృష్టించడంలో అర్ష్‌దీప్‌ నేర్పరి. ఇలాంటి మైదానంలో నలుగురు స్పిన్నర్లను తీసుకోవాల‌ని నేను అనుకోను.. పరిస్థితులు ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటే.. వారు మాత్రమే ఆడతారని రోహిత్ అన్నాడు. స్పిన్నర్లను టోర్నమెంట్‌లో జట్టు అవసరాలకు అనుగుణంగా మార్పులు చేస్తామన్నాడు.

ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్ చేతికి గాయం కావడంతో రిటైరయ్యాడు. పాకిస్థాన్‌తో కీలక మ్యాచ్‌కు ముందు కెప్టెన్ గాయపడడం భారత్‌కు ఆందోళన కలిగిస్తోంది. అయితే.. తనకు అయ్యింది స్వల్ప గాయమేనని రోహిత్‌ తెలిపాడు. జూన్ 9న పాకిస్థాన్‌తో భారత జట్టు తన రెండో మ్యాచ్ ఆడుతుంది.

ఐర్లాండ్‌పై భారత బౌలర్లు మంచి ప్రదర్శన చేశారు. భారత్ తరఫున అర్ష్‌దీప్ సింగ్ నాలుగు ఓవర్లలో 35 పరుగులిచ్చి రెండు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా 27 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. జస్ప్రీత్ బుమ్రా మూడు ఓవర్లలో ఆరు పరుగులిచ్చి రెండు వికెట్లు, మహ్మద్ సిరాజ్ మూడు ఓవర్లలో 13 పరుగులిచ్చి ఒక వికెట్ తీశారు.

Next Story