వారిని వదులుకోవడం నిజంగా చాలా బాధగా ఉంది : రోహిత్ శర్మ
Rohit says Absolutely Heartbreaking on Not Being Able To Retain All players.ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)2022
By తోట వంశీ కుమార్
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)2022 మెగా వేలానికి సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో జట్లన్నీ తమకు కావాల్సిన ప్రధాన ఆటగాళ్లను అట్టిపెట్టుకుని మిగతా వాళ్లను వేలానికి విడుదల చేశాయి. ఇక ఐదు సార్లు విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు తమ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, పొలార్డ్‌లను అట్టిపెట్టుకుంది. గత కొద్ది సీజన్లుగా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న పైర్ గన్స్.. ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, ట్రెంట్ బౌల్ట్ వంటి ఆటగాళ్లను అట్టిపెట్టుకోలేకపోయింది.
గరిష్టంగా నలుగురిని మాత్రమే తీసుకునే అవకాశం ఉండడంతో వీరిని వదులుకోక తప్పలేదు. దీనిపై హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ఈ ఇయర్ రిటెన్షన్ ముంబై ఇండియన్స్‌కు చాలా కఠినమైనదని పేర్కొన్నాడు. మీ అందరికీ తెలిసినట్లుగా ఈ ఏడాది ముంబై ఇండియన్స్‌కు ఇది కష్టతరమైన రిటెన్షన్ అవుతుంది. మా జట్టులో పటిష్టమైన ఆటగాళ్లు ఉన్నారు. ఖచ్చితంగా గన్ ప్లేయర్‌లు ఉన్నారు. వారిని విడుదల చేయడం చాలా హృదయ విదారకంగా ఉందని రోహిత్ అన్నాడు.
వారంతా ప్రాంచైజీ కోసం ఎంతో అద్భుతంగా ఆడారని కితాబు ఇచ్చాడు. ఎన్నెన్నో చెరిగిపోని గుర్తులను అందించారని.. వారిని వదిలేయడమంటే గుండెకు భారమైన పనేనన్నాడు. ఇక తనతో సహా నలుగురు ఆటగాళ్లతో మంచి కోర్ టీమ్‌ను ఏర్పరచుకుంటామన్నాడు. ఇక వేలంలో మంచి ఆటగాళ్లను దక్కించుకుని మరోసారి పటిష్టమైన జట్టును ఏర్పరచడమే తమ ముందున్న ప్రస్తుత లక్ష్యమన్నాడు.