రిటైర్మెంట్‌కు కారణం చెప్పిన అశ్విన్.. రోహిత్ ఏమ‌న్నాడంటే..

గాబా టెస్టు డ్రా అయిన వెంటనే భారత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

By Medi Samrat  Published on  18 Dec 2024 10:30 AM GMT
రిటైర్మెంట్‌కు కారణం చెప్పిన అశ్విన్.. రోహిత్ ఏమ‌న్నాడంటే..

గాబా టెస్టు డ్రా అయిన వెంటనే భారత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మ్యాచ్ ముగిసిన వెంటనే కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి విలేకరుల సమావేశానికి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ తన నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. మీడియా సమావేశంలో అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీని తర్వాత, సిరీస్ మధ్యలో అశ్విన్ ఎందుకు రిటైర్మెంట్ తీసుకున్నాడు అనే ప్రశ్న తలెత్తగా.. దానికి సమాధానం ఇచ్చాడు. తనలో ఇంకా కొంత బలం మిగిలి ఉందని, క్లబ్ క్రికెట్‌లో కొనసాగుతానని అశ్విన్ చెప్పాడు. "నేను మీ సమయాన్ని ఎక్కువగా తీసుకోను. భారత క్రికెటర్‌గా ఈరోజు నా చివరి రోజు" అని రోహిత్ శర్మతో కలిసి విలేకరుల సమావేశంలో అశ్విన్ చెప్పాడు.

అశ్విన్ మాట్లాడుతూ.. "భారత క్రికెటర్‌గా, అంతర్జాతీయ క్రికెటర్‌గా ఇది నా చివరి రోజు. క్రికెటర్‌గా నాలో కొంత బలం మిగిలి ఉందని నేను భావిస్తున్నాను, అయితే నేను బహుశా క్లబ్ క్రికెట్‌లో దానిని చూపించడానికి ప్రయత్నిస్తాను, అయితే ఇది నా చివరి రోజు. నేను అంతర్జాతీయ క్రికెట్‌లో చాలా సరదాగా గడిపాను. రోహిత్ శర్మ, ఇతర సహచరులతో నేను చాలా జ్ఞాపకాలను చూశానని చెప్పాలి. నేను బీసీసీఐకి, నా సహచరులకు, కోచ్‌లందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ముగించాడు.

అశ్విన్ రిటైర్మెంట్ గురించి రోహిత్ శర్మ మాట్లాడుతూ.. "కొన్ని నిర్ణయాలు వ్యక్తిగతమైనవి. అతను కోరుకున్నదానికి కట్టుబడి ఉండాలి. అతని నిర్ణయాన్ని జట్టు గౌరవిస్తుందన్నాడు. "రిటైర్మెంట్‌కు కొన్ని గంటల ముందు.. అశ్విన్ చాలా ఎమోషనల్‌గా కనిపించాడు. అతడు డ్రెస్సింగ్ రూమ్‌లో విరాట్ కోహ్లీతో కలిసి కూర్చున్నాడు. ఈ సమయంలో విరాట్ అతన్ని కౌగిలించుకున్నాడు.

Next Story