కోహ్లీ, రోహిత్ ఏడుస్తూనే ఉన్నారు
అహ్మదాబాద్‌లో జరిగిన ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో మెన్ ఇన్ బ్లూ ఓడిపోయాక
By Medi Samrat Published on 30 Nov 2023 4:04 PM ISTఅహ్మదాబాద్‌లో జరిగిన ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో మెన్ ఇన్ బ్లూ ఓడిపోయాక డ్రెస్సింగ్ రూమ్ లో పరిస్థితి గురించి భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బయటపెట్టాడు. టోర్నమెంట్ లో రోహిత్ శర్మ నాయకత్వ లక్షణాలను కొనియాడాడు. మెన్ ఇన్ బ్లూ 2013 నుండి ICC ట్రోఫీని గెలవలేదు. ఆస్ట్రేలియా ఆరవ ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకుని కొత్త రికార్డును నెలకొల్పింది.
భారత మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్‌కి యూట్యూబ్ ఛానెల్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో అశ్విన్ మాట్లాడుతూ.. మ్యాచ్ తర్వాత వెటరన్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కన్నీళ్లు పెట్టుకున్నారని తెలిపాడు. మ్యాచ్ ఓడిపోవడంతో మేము ఎంతో బాధను అనుభవించాము.. రోహిత్, విరాట్ ఏడ్చారు.. అది చూసి నాకు బాధగా అనిపించిందని అన్నాడు అశ్విన్. రోహిత్ శర్మ నాయకత్వంతో జట్టును ముందుకు నడిపించడంతో పాటు తొలి బంతి నుంచే బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడని అశ్విన్ కొనియాడాడు. "మీరు భారత క్రికెట్‌ను చూస్తే, MS ధోనీ అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడని ప్రతి ఒక్కరూ చెబుతారు. రోహిత్ శర్మ కూడా అద్భుతమైన వ్యక్తి. అతను జట్టులోని ప్రతి ఒక్కరినీ అర్థం చేసుకుంటాడు. జట్టులోని ప్రతి సభ్యుడిని వ్యక్తిగతంగా తెలుసుకోవటానికి కృషి చేస్తాడు" అని అశ్విన్ చెప్పాడు. నిద్రను మానేసి మరీ జట్టు సమావేశాలలో భాగమవుతాడని.. ప్రతి ఆటగాడికి వ్యూహాలను ఎలా వివరించాలో అర్థం చేసుకోవడానికి అతను కృషి చేస్తాడు. ఇది భారత క్రికెట్‌లో అధునాతన స్థాయి నాయకత్వమని అన్నాడు అశ్విన్.