ధోని తరువాత అతడే చెన్నై కెప్టెన్
Robin Uthappa says Jadeja will be the captain of CSK.ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2022 మెగా వేలానికి ముందు
By తోట వంశీ కుమార్ Published on 1 Dec 2021 9:10 AM GMTఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2022 మెగా వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. కెప్టెన్ ధోనితో పాటు రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్‌లను చెన్నై జట్టు అట్టిపెట్టుకుంది. కాగా.. తమ తొలి ప్రాధాన్యత ఆటగాడిగా ధోని కంటే ముందు జడేజాకే సీఎస్‌కే ప్రాధాన్యం ఇచ్చింది. అతడికి రూ.16కోట్లు, ధోనికి రూ.12కోట్లు, మొయిన్ అలీకి రూ.8కోట్లు, రుతురాజ్ గైక్వాడ్‌లకు రూ.6 కోట్లు చెన్నై యాజమాన్యం చెల్లించనుంది. దీంతో ధోని తరువాత చెన్నైకి కెప్టెన్‌గా జడేజా వ్యవహరించనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఆల్‌రౌండర్‌గా జడేజా ఎలా ఆడతాడో ధోనికి బాగా తెలుసు. ఇక 2021 ఐపీఎల్ ముగిసిన అనంతరం తన వారసుడిని ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు ధోని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జడేజాను తదుపరి కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఇదే విషయాన్ని టీమ్ఇండియా మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్ప కూడా అంటున్నాడు. ధోని కావాలనే రెండో ప్రాధాన్య ఆటగాడిగా కొనసాగాలని నిర్ణయించుకున్నాడని, జట్టులో జడేజా సత్తా ఏంటో అతడికి బాగా తెలుసు. ధోని నిష్ర్కమణ తరువాత జడేజాకు పగ్గాలు అప్పగిస్తాడనుకుంటున్నాను అని రాబిన్ ఉతప్ప తెలిపాడు.
మరో మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ కూడా ఈ వ్యాఖ్యలను సమర్థించాడు. జడేజాకు చెన్నై కెప్టెన్‌గా కావాల్సిన లక్షణాలు అన్ని ఉన్నాయని.. అతడో గొప్ప ఆటగాడని చెప్పుకొచ్చాడు. టెస్టు క్రికెట్‌లో మెరుగ్గా రాణించడంతో పాటు వన్డేలోనూ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. అందుకే ధోని తరువాతి కెప్టెన్‌గా జడేజానే సరైనోడు అనిపిస్తోందని పార్థివ్ తెలిపాడు.