అరెస్ట్ వారెంట్ కు ముందు చాలా జరిగింది: రాబిన్ ఊతప్ప
ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) విరాళాలకు సంబంధించిన మోసం ఆరోపణలపై భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది.
By Medi Samrat Published on 22 Dec 2024 3:46 PM GMTఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) విరాళాలకు సంబంధించిన మోసం ఆరోపణలపై భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఉతప్ప సెంటారస్ లైఫ్‌స్టైల్ బ్రాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్‌గా పనిచేసినప్పుడు ఉద్యోగుల ఖాతాల్లో పీఎఫ్ జమ చేయలేదని, 23.36 లక్షల రూపాయల మొత్తానికి సంబంధించి అవకతవకలు జరిగాయని తేలడంతో వారెంట్ జారీ అయింది. రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ షడక్షర గోపాల్ రెడ్డి వారెంట్ జారీ చేశారు.
తనపై వచ్చిన ఆరోపణలపై రాబిన్ ఊతప్ప స్పందించారు. సదరు కంపెనీలో తాను ఎలాంటి ఎగ్జిక్యూటివ్ రోల్ పోషించడం లేదని, పెట్టుబడి పెట్టడం వల్ల తనకు డైరెక్టర్ అన్న పదవి ఇచ్చారన్నారు. సంస్థ వ్యవహారాల్లో తాను ఎన్నడూ కల్పించుకోలేదని, తాను పెట్టుబడి పెట్టిన నిధులను తిరిగి చెల్లించకుండా తనను మోసం చేశారని అన్నారు.
2018-19లో సెంటారస్ లైఫ్ స్టైల్ బ్రాండ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో డైరెక్టర్‌గా నియమితుడినయ్యానని.. పెట్టబడి పెట్టడంతో మాత్రమే తనకు ఆ పదవి ఇచ్చారన్నారు. కానీ యాక్టివ్ ఎగ్జిక్యూటివ్ రోల్‌ను నేనెన్నడూ పోషించలేదని తెలిపారు. బోర్డ్ అఫ్ డైరెక్టర్లు తీసుకునే నిర్ణయాల్లో ఎన్నడూ కల్పించుకోలేదని అన్నారు. కొన్నేళ్ల క్రితమే నేను ఆ పదవికి రాజీనామా చేశాను. ఇదొక్కటే కాదు.. మరికొన్ని సంస్థల్లోనూ పెట్టుబడులు పెట్టా. అక్కడా ఎన్నడూ ఎగ్జిక్యూటివ్‌గా విధులు నిర్వర్తించలేదని ఊతప్ప తెలిపారు. సెంటారస్ లైఫ్ స్టైల్‍లో పెట్టుబడి పెట్టిన నిధులను తిరిగి చెల్లించడంలో సంస్థ విఫలమైందని, ఆ సంస్థపై న్యాయపరమైన చర్యలు తీసుకొనేందుకు సిద్ధమయ్యానన్నారు రాబిన్ ఊతప్ప.