చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ పోరుకు ముందు భారత జట్టుకు ఓ బ్యాడ్ న్యూస్. వైరల్ ఫీవర్ కారణంగా వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ ప్రాక్టీస్ సెషన్‌కు దూరమయ్యాడని భారత వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు.
ఈ గేమ్ రెండు జట్లకు అత్యంత కీలకమైన పోరు. పాకిస్తాన్ తమ టైటిల్ డిఫెన్స్‌ను సజీవంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుండగా, సెమీస్‌లో తన బెర్త్‌ను దాదాపుగా ఖాయం చేసుకోవాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్ ను పాకిస్థాన్ ఓడించింది. ఆ మ్యాచ్ కు ప్రతీకారం తీర్చుకోవడానికి, పాకిస్థాన్ జట్టును ఛాంపియన్స్ ట్రోఫీ నుండి అవుట్ చేయడానికి భారత్ కు ఇదొక గొప్ప అవకాశం. 50 ఓవర్లు, T20 ప్రపంచ కప్‌ల మాదిరిగా కాకుండా, ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ భారత్‌పై 3-2 ఆధిక్యాన్ని కలిగి ఉంది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో 180 పరుగుల ఓటమి భారత్ ను ఇంకా వెంటాడుతూనే ఉంది.