కారు ప్రమాదానికి గురైన టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్కు ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్ శ్యామ్ వెల్లడించారు. పంత్ ముఖంపై గాయాలు కావడంతో.. డెహ్రడూన్ లోని మ్యాక్స్ ఆసుపత్రిలో అతనికి ప్లాస్టిక్ సర్జరీ చేసినట్లు తెలిపారు. పంత్ కు మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలించాలని అనుకున్నా చివరకు మ్యాక్స్ లోనే శస్త్ర చికిత్స చేసినట్లు తెలిపారు. రిషబ్ పంత్ ఆరోగ్య పరిస్థితిపై వివరాలను తెలుసుకోడానికి డెహ్రాడూన్కు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ బృందం చేరుకుంది. పంత్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించింది. పంత్ ఆరోగ్యానికి సంబంధించి నివేదికలను తెప్పించుకుంటూ అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు డీడీసీఏ ప్రకటించింది.
పంత్ కు ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత అతనికి ఎక్స్ రే తీశారు. అయితే పంత్ కుడి కాలు లిగ్మెంట్ కొద్దిగా జరిగినట్లే రిపోర్టులో స్పష్టమైంది. మెదడు, వెన్నెముకకు సంబంధించిన ఎంఆర్‌ఐ స్కానింగ్‌లో ఎలాంటి సమస్య లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం నుంచి ప్రాణాలతో క్షేమంగా బయటపడడానికి సాయపడిన బస్సు డ్రైవర్ కు ప్రశంసలు లభిస్తున్నాయి. పంత్ ను కాపాడిన బస్సు డ్రైవర్ సుశీల్, కండక్టర్ పరమ్ జీత్ కు హర్యానా రోడ్ వేస్ అధికారులు ప్రశంసా పత్రాలు, షీల్డ్ ను బహూకరించి, వారిని అభినందించారు. మానవత్వానికి వీరు నిదర్శనమని హర్యానా రాష్ట్ర రవాణా మంత్రి మూల్ చంద్ శర్మ ప్రశంసించారు.