టీమిండియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఢాకాలో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ లో 314 పరుగులకు ఆలౌట్ అయింది. బంగ్లాదేశ్ పై 87 పరుగుల ఆధిక్యాన్ని పొందింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ ఆట చివరికి వికెట్ నష్టపోకుండా 6 ఓవర్లలో 7 పరుగులు చేసింది. ఇంకా 80 పరుగులు వెనుకబడి ఉంది.
భారత్ తొలి ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ సెంచరీలు చేజార్చుకున్నారు. పంత్ 105 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సులతో 93 పరుగులు చేయగా, అయ్యర్ 105 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సులతో 87 పరుగులు చేశాడు. వీరిద్దరూ ఐదో వికెట్ కు 159 పరుగులు జోడించడం విశేషం. కేఎల్ రాహుల్ 10, శుభ్‌మన్ గిల్ 20, ఛటేశ్వర్ పుజారా 24, విరాట్ కోహ్లీ 24, రిషబ్ పంత్ 93, శ్రేయాస్ అయ్యర్ 87, అక్షర్ పటేల్ 4, రవిచంద్రన్ అశ్విన్ 12, జయదేవ్ 14(నాటౌట్), ఉమేశ్ యాదవ్ 14, మొహమ్మద్ సిరాజ్ 7 పరుగులు చేశారు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 314 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబ్ అల్ హసన్, తైజుల్ ఇస్లాం నాలుగేసి వికెట్లు తీశారు. అహ్మద్, మెహిదీ హసన్ కు చెరో వికెట్టు దక్కాయి. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 227 పరుగులు చేసింది.