పంత్ పోరాడినా.. బౌలర్ల దే భారం
Rishabh Pant Century keeps India in hunt but South Africa close on series win.దక్షిణాఫ్రికాలో తొలి టెస్టు సిరీస్ విజయం
By తోట వంశీ కుమార్ Published on 14 Jan 2022 8:10 AM ISTదక్షిణాఫ్రికాలో తొలి టెస్టు సిరీస్ విజయం టీమ్ఇండియాకు అంత తేలిగ్గా దక్కేలా కనిపించడం లేదు. తొలి టెస్టులో విజయం సాధించిన భారత జట్టు రెండో టెస్టులో చతికిల పడింది. ఇక నిర్ణయాత్మక మూడో టెస్టులో చాలా వెనకబడి పోయింది. వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ శతకంతో సత్తాచాటిన మిగిలిన బ్యాట్స్‌మెన్లు చేతులెత్తేయడంతో రెండో ఇన్నింగ్స్‌లో మరోసారి తక్కువ పరుగలకే టీమ్ఇండియా ఆలౌటైంది. 212 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. కీగన్ పీటర్సన్(48) క్రీజులో ఉన్నాడు. మరో 111 పరుగులు చేస్తే సౌతాఫ్రికాని విజయం వరించనుండగా.. భారత జట్టు గెలవాలంటే 8 వికెట్లు తీయాలి.
అంతకముందు ఓవర్‌నైట్ స్కోర్ 57/2 మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. సపారీల బౌలర్లు జాన్సన్(4/36), రబాడ(3/53), ఎంగిడి(3/21)ల ధాటికి 198 పరుగులకే కుప్పకూలింది. రిషబ్‌పంత్ (100 నాటౌట్ ; 139 బంతుల్లో 6పోర్లు, 4 సిక్సర్లు) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. అతడికి కెప్టెన్ కోహ్లీ(29 ; 143 బంతుల్లో 4పోర్లు) కాస్త సహకారం అందించాడు. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 13 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని సపారీలకు 212 పరుగుల లక్ష్యాన్ని భారత్ నిర్దేశించింది.
212 పరుగుల లక్ష్య చేధనలో ఓపెనర్ మార్‌క్రమ్ (16) త్వరగానే పెవిలియన్ చేరినా.. కెప్టెన్ డీన్ ఎల్గర్(30; 96 బంతుల్లో 3 పోర్లు), కీగన్ పీటర్సన్(48 నాటౌట్; 61 బంతుల్లో 7 పోర్లు) లు జట్టును ఆదుకున్నారు. ఓ ఎండ్‌లో ఎల్గర్ పాతుకుపోగా.. పీటర్సన్ స్వేచ్చగా బ్యాట్ ఝుళిపించాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 78 పరుగులు జోడించి జట్టును పటిష్ట స్థితిలోకి తెచ్చారు. మూడో రోజు ఆట ఆఖరి ఓవర్‌లో బుమ్రా ఎల్గర్‌ను ఔట్ చేయడం ద్వారా భారత జట్టు కాస్త పోటిలోకి వచ్చింది. నాలుగో రోజు భారత బౌలర్లు ఎలా రాణిస్తారు అన్నదానిపై సిరీస్ విజయం ఆధారపడి ఉంది.