ఏ స‌పోర్ట్ లేకుండా మైదానాన్ని తాకి.. బ్యాటింగ్‌కు దిగిన పంత్‌.. వీడియో వైర‌ల్‌

భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ కారు ప్రమాదం తర్వాత కోలుకుంటున్నాడు.

By Medi Samrat  Published on  16 Aug 2023 10:45 AM GMT
ఏ స‌పోర్ట్ లేకుండా మైదానాన్ని తాకి.. బ్యాటింగ్‌కు దిగిన పంత్‌.. వీడియో వైర‌ల్‌

భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ కారు ప్రమాదం తర్వాత కోలుకుంటున్నాడు. పంత్ ప్ర‌స్తుతం ఎన్‌సీఏలో పునరావాసం పొందుతున్నాడు. ఎప్పటికప్పుడు తన ఫిట్‌నెస్ గురించి సమాచారం ఇస్తూనే ఉన్నాడు. ఇప్పుడు పంత్‌కు సంబంధించి రెండు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో పంత్ పిచ్‌పై బ్యాటింగ్ చేయడం.. ప్రమాదం తర్వాత మొదటిసారి ప్రసంగం చేయడం చూడ‌వ‌చ్చు.

రిషబ్ పంత్ వైరల్ వీడియోను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఒక వీడియోలో రిషబ్ పంత్ పూర్తి సన్నద్ధతతో క్రికెట్ మైదానంలోకి వెళ్లాడు. మైదానంలోకి దిగే ముందు మైదానాన్ని చేతితో తాకి.. ఎలాంటి సపోర్టు లేకుండా సొంతంగా క్రీజులోకి వెళ్లాడు. బ్యాటింగ్ చేశాడు. అయితే ఈ సమయంలో పంత్ ఖచ్చితంగా కొంత అసౌకర్యంగా కనిపించాడు. అయితే.. పంత్‌ని చూసిన అభిమానులు మాత్రం ఆనందంతో ఈల‌లు వేశారు.

రెండో వైరల్ వీడియోలో పంత్‌ ప్రసంగిస్తూ కనిపించాడు. రిషబ్ పంత్ ఆగస్టు 15 సందర్భంగా ఎన్‌సీఏలో క్రీడాకారుల‌నుద్దేశించి ప్రసంగించాడు. జీవితంలోని క్షణాలను ఆస్వాదించమని పంత్‌ సలహా ఇచ్చాడు. మీరు పెద్దయ్యాక ఆటను ప్రేమించడం మానేస్తారు.. చాలా ఒత్తిడికి లోనవడమే దీనికి కారణం. మీ జీవితాన్ని ప్రత్యేకంగా మార్చుకోవడానికి ఎన్నో పనులు చేస్తారు.. అందుకే జీవితంలోని క్షణాలను ఆస్వాదించమని పంత్‌ సలహా ఇచ్చాడు.

గతేడాది డిసెంబర్‌లో రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రామ‌దంలో తీవ్ర గాయాలు అవ‌డంతో పంత్‌ మోకాలికి శస్త్రచికిత్స చేయించుకోవలసి వచ్చింది. అందుకే అత‌డు చాలా టోర్నీలకు దూరమయ్యాడు. ప్రస్తుతం పునరావాసంలో ఉన్న పంత్‌ వేగంగా కోలుకుంటున్నాడు. గాయం కార‌ణంగా రిషబ్ పంత్ ఐపీఎల్‌లో ఆడ‌లేదు. త్వ‌ర‌గా కోలుకుని ప్రపంచ కప్‌లో ఆడుతాడని అభిమానులు ఆశిస్తున్నారు.

Next Story