ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో పంత్ అద్భుత‌ ఇన్నింగ్స్‌

Rishabh Pant and Ravindra Jadeja put India on top at Edgbaston.బ‌ర్మింగ్‌హామ్ వేదిక‌గా ప్రారంభ‌మైన ఐదో టెస్టులో తొలి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 July 2022 8:24 AM IST
ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో పంత్ అద్భుత‌ ఇన్నింగ్స్‌

బ‌ర్మింగ్‌హామ్ వేదిక‌గా ప్రారంభ‌మైన ఐదో టెస్టులో తొలి రోజు టీమ్ఇండియా త‌డ‌బ‌డి నిల‌బ‌డింది. ఓ ద‌శ‌లో 98 ప‌రుగుల‌కే 5 వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. ఈ ద‌శలో వైస్ కెప్టెన్‌, వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ ( 146; 111 బంతుల్లో 19 ఫోర్లు, 4 సిక్సర్లు) భారీ శ‌త‌కంతో చెల‌రేగడంతో తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి టీమ్ఇండియా 338/7 స్కోరుతో నిలిచింది. ప్ర‌స్తుతం క్రీజులో రవీంద్ర జడేజా (83 బ్యాటింగ్‌; (163 బంతుల్లో 10 ఫోర్లు), ష‌మీ(0) క్రీజులో ఉన్నారు.

మ‌బ్బులు ప‌ట్టిన వాతావ‌ర‌ణంలో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ మ‌రో ఆలోచ‌న లేకుండా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేప‌ట్టిన టీమ్ఇండియాకు శుభారంభం ద‌క్క‌లేదు. ఇంగ్లీష్ బౌల‌ర్లు అండ‌ర్స‌న్‌, బ్రాడ్‌, పాట్స్ ఆఫ్ స్టంప్ మీద ఒకే లైన్‌లో బంతులు సందిస్తూ భార‌త బ్యాట్స్‌మెన్ల‌కు పెద్ద ప‌రీక్షే పెట్టారు. శుభ్‌మన్‌ గిల్‌ (17), ఛ‌తేశ్వర్‌ పుజారా (13), హనుమ విహారి (20), విరాట్‌ కోహ్లీ (11), శ్రేయస్‌ అయ్యర్‌ (15) లు విఫ‌లం కావ‌డంతో ఓ ద‌శ‌లో టీమ్ఇండియా 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ ద‌శలో పంత్‌-జ‌డేజా జోడి ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోవడంతో మెరుగైన స్కోరు చేయగలిగింది.

ముఖ్యంగా పంత్ వ‌న్డే త‌ర‌హాలో చెల‌రేగి పోయాడు. ఏ బౌల‌ర్‌ను వ‌దిలి పెట్ట‌లేదు. అత‌డికి జ‌డేజా చ‌క్క‌ని స‌హాకారం అందించాడు. పంత్ 89 బంతుల్లో టెస్టు క్రికెట్‌లో ఐదో సెంచరీ త‌న ఖాతాలో వేసుకున్నాడు. అనంత‌రం టీ20 త‌ర‌హాలో చెల‌రేగాడు. అదే ఊపులో రూట్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడ‌బోయిన పంత్‌.. స్లిప్‌లో క్రాలీ చేతికి చిక్కాడు. పంత్-జ‌డేజా జోడి ఆరో వికెట్‌కు రికార్డు స్థాయిలో 222 పరుగులు జోడించడంతో భార‌త్ కోలుకుంది. కాసేప‌టికే శార్ధూల్‌(1) ను స్టోక్స్ పెవిలియ‌న్ చేర్చాడు. ఆ త‌రువాత ష‌మి(0)తో క‌లిసి జ‌డేజా మ‌రో వికెట్ ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో అండర్సన్ మూడు, పాట్ రెండు వికెట్లు పడగొట్టారు.

Next Story