పారిస్ ఒలింపిక్స్-2024 15వ రోజు శనివారం 76 కిలోల మహిళల రెజ్లింగ్ విభాగంలో భారత్‌కు చెందిన రితికా హుడా హంగేరీకి చెందిన బెర్నాడెట్ నాగిపై ప్రీక్వార్టర్ ఫైనల్లో విజయం సాధించింది. ఈ విభాగంలో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన దేశానికి చెందిన తొలి రెజ్లర్ 21 ఏళ్ల రితికా 12-2 తేడాతో తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. తొలి పీరియడ్‌లో 4-0తో.. ముందంజలో ఉన్న రితికా రెండో పీరియడ్‌లో అద్భుత ప్రదర్శన చేసి హంగేరీ రెజ్లర్‌కు పెద్దగా అవకాశాలు ఇవ్వలేదు.
రితికా రోహ్‌తక్‌లోని ఖడ్కరా గ్రామంలో జన్మించింది. ఆమె ఇండియన్ నేవీలో అధికారిణి. ఆమె 2022లో జరిగిన ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో 72 కిలోల విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆ తరువాత టిరానాలో జరిగిన 2023 అండర్ -23 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకుంది. 2024లో ఆసియా ఛాంపియన్‌షిప్‌లో 72 కేజీల విభాగంలో రితికా కాంస్య పతకం సాధించింది.
ఏదో ఒకరోజు భారత్‌కు ఒలింపిక్ పతకం సాధించాలనేది రితికా కల. ఆ కలను నెరవేర్చుకోవడానికి ఆమె తల్లి, తండ్రి కూడా రితికాకు గట్టిగా మద్దతు ఇచ్చారు. రితికా కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేదు. అయినప్పటికీ రితికా ప్రతి అవసరాన్ని తీర్చారు. రితికా హాంగ్‌జౌ ఆసియా క్రీడలు, బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్ రెండింటికీ అర్హత సాధించలేకపోయింది. దీంతో తీవ్ర నిరాశకు గురైన రితికా రెజ్లింగ్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుంది.
తల్లిదండ్రులు కూతురికి చాలా ధైర్యం చెప్పి.. నిరాశ చెందవద్దని ప్రేరేపించారు. కొంత కాలం తర్వాత కోలుకున్న రితికా.. ఓటమిని స్ఫూర్తిగా తీసుకుని కష్టపడింది. రితికా కష్టపడి పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించి ఇప్పుడు దేశం గర్వించేలా చేస్తోంది.