ఆర్‌సీబీ పేసర్ హర్షల్ పటేల్ ఇంట తీవ్ర విషాదం
RCB pacer Harshal Patel leaves bio-bubble following death in family.ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో బెంగళూరు
By తోట వంశీ కుమార్ Published on 10 April 2022 2:07 PM ISTఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో బెంగళూరు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అతడికి సోదరి వరుస అయ్యే బంధువు మృతి చెందడంతో అతడు బయోబబుల్‌ను వీడాడు. శనివారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ ముగిసిన అనంతరం హర్షల్ పటేల్ కు ఈ విషయం తెలిసింది. వెంటనే అతడు జట్టును వీడి గ్రామానికి బయలుదేరాడు. ఈ విషయాన్ని ఐపీఎల్ నిర్వాహకులు ధ్రువీకరించారు.
'హర్షల్ పటేల్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. అతడి సోదరి మృతి చెందింది. ముంబైతో మ్యాచ్ ముగిసిన తరువాత అతడికి విషయం తెలిసింది. అతడు బయో బబుల్‌ను వీడాడు. టీమ్ బస్సులో కాకుండా వేరుగా వెళ్లిపోయాడు. చెన్నైతో జరిగే మ్యాచ్(ఏప్రిల్ 12) నాటికి అందుబాటులో ఉండే అవకాశం ఉంది' అని ఐపీఎల్ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలియజేశారు.
గతేడాది ఐపీఎల్ సీజన్ లో అత్యధిక వికెట్ల (32) తో పర్పుల్ క్యాప్ దక్కించుకున్న హర్షల్ పటేల్.. ఇప్పటివరకు ఈ సీజన్ లో నాలుగు మ్యాచులాడి 6 వికెట్లు పడగొట్టాడు. మిడిల్ ఓవర్స్ తో పాటు డెత్ ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేయడంలో దిట్ట అయిన హర్షల్.. శనివారం ముంబై తో జరిగిన మ్యాచులో నాలుగు ఓవర్లు వేసి 23 పరుగులే ఇచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. ప్రస్తుతం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్‌లో నాలుగు మ్యాచుల్లో మూడు విజయాలు(6) సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.