తొక్కిసలాట మృతులకు పరిహారం ప్రకటించిన ఆర్సీబీ.. కొడుకును కోల్పోయిన తండ్రి ఏమ‌న్నాడంటే..?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) జూన్ 4, 2025న ఎం. చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 11 మంది అభిమానుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించింది.

By Medi Samrat
Published on : 30 Aug 2025 5:49 PM IST

తొక్కిసలాట మృతులకు పరిహారం ప్రకటించిన ఆర్సీబీ.. కొడుకును కోల్పోయిన తండ్రి ఏమ‌న్నాడంటే..?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) జూన్ 4, 2025న ఎం. చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 11 మంది అభిమానుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించింది. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ అధికారిక ఖాతాలైన ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించారు.

బెంగళూరులో ఆర్‌సిబి టైటిల్ విన్నింగ్ సెలెబ్రేషన్స్ సందర్భంగా జరిగిన ఈ విషాద ఘటన, నగర క్రీడా చరిత్రలో చీకటి క్షణాలలో ఒకటిగా మిగిలిపోయింది. అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించి ఆర్‌సిబి తమ తొలి ఐపిఎల్ టైటిల్‌ను గెలుచుకున్న 24 గంటల్లోపే చిన్నస్వామి స్టేడియం వెలుపల వేలాది మంది అభిమానులు గుమిగూడారు. కానీ స్టేడియం గేట్ల వైపు అభిమానుల దూసుకొచ్చిన కారణంగా 11 మంది మరణించగా, 50 మందికి పైగా గాయపడటంతో వేడుకలు గందరగోళంగా మారాయి.

తాజాగా ఈ ఘటనలో మరణించిన కుటంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన తర్వాత మృతుడు భూమిక్ తండ్రి D.H లక్ష్మణ్ మాట్లాడుతూ.. "3 నెలల తర్వాత కూడా నా కొడుకు జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. నా కొడుకు ఇప్పుడు నాతో లేడు. అతడే లేనప్పుడు ఈ పరిహారపు డబ్బు నా పాదాలపై దుమ్ముతో సమానం. నాకు ఈ పరిహారం అవసరం లేదని నేను ఇప్పటికే చెప్పాను. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్​ నుంచి చెల్లించినట్లున్నారు. నేను అకౌంట్ కూడా చెక్ చేయలేదు. మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదు. మాకు వారి డబ్బు కూడా అవసరం లేదు. దయచేసి దీని గురించి మళ్లీ చర్చించవద్దు" అని ఆయన చెబుతూ విలపించారు.

Next Story