జడేజా భారీ శతకం.. తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన భారత్
Ravindra Jadeja Slams Career-Best India Declare At 574/8.మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో
By తోట వంశీ కుమార్ Published on 5 March 2022 8:33 AM GMTమొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ స్కోర్ సాధించింది. మొత్తం 129.2 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 574 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. రవీంద్ర జడేజా(175 నాటౌట్; 228 బంతుల్లో 17 పోర్లు, 3 సిక్సర్లు) భారీ శతకంతో అదరగొట్టగా.. రిషబ్ పంత్ (96; 97 బంతుల్లో 9పోర్లు, 4 సిక్సర్లు), రవిచంద్రన్ అశ్విన్(61; 82 బంతుల్లో 8పోర్లు), హనుమ విహారి (58; 128 బంతుల్లో 5పోర్లు)లు రాణించారు. శ్రీలంక బౌలర్లలో సురంగ లక్మల్, విశ్వ ఫెర్నాండో, లసిత్ ఎంబుల్దెనియా తలో రెండో వికెట్లు పడగొట్టగా.. లాహిరు కుమార, ధనంజయ డి సిల్వా ఒక్కొ వికెట్ తీశారు.
అంతకముందు 6 నష్టానికి 357 పరుగులతో రెండో రోజు ఆటను ఆరంభించిన భారత్ మరో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 217 పరుగులు సాధించింది. ఓవర్ నైట్ బ్యాట్స్‌మెన్లు జడేజా(45), అశ్విన్(10) లు రెండో రోజు తొలి సెషన్‌లో శ్రీలంక బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్నారు. వీరిద్దరు చూడచక్కని షాట్లతో అలరించారు. ముందుగా జడేజా అర్థశతకం చేయగా.. ఆ తరువాత అశ్విన్ ఆ ఘనతను అందుకున్నాడు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 130 పరుగులు జోడించారు. 61 పరుగులు చేసిన అశ్విన్‌ను లక్మల్ పెవిలియన్ చేర్చాడు. జయంత్ యాదవ్(2) తొందరగా ఔటైనా.. షమీ(20 నాటౌట్)తో కలిసి జడేజా లంక బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో 100, 150 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. జడేజా, షమీలు అభేద్యమైన తొమ్మిదో వికెట్‌కు 103 పరుగులు జోడించారు. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు.