శుభవార్త.. జడేజా మోకాలి సర్జరీ సక్సెస్
Ravindra Jadeja knee surgery successfull.ఆసియా కప్ టోర్నీ నుంచి జడేజా అర్థాంతరంగా తప్పుకున్న సంగతి తెలిసిందే.
By తోట వంశీ కుమార్ Published on 7 Sept 2022 1:40 PM ISTమోకాలి గాయం తిరగబెట్టడంతో ఆసియా కప్ 2022 టోర్నీ నుంచి ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అర్థాంతరంగా తప్పుకున్న సంగతి తెలిసిందే. అతడి గాయాన్ని పరిశీలించిన డాక్టర్లు శస్త్ర చికిత్స చేయాలని సూచించారు. ఈ క్రమంలో అతడికి మోకాలి ఆపరేషన్ జరిగింది. శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి అయింది. ఈ విషయాన్ని జడేజానే స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు.
'సర్జరీ విజయవంతమైంది. త్వరలో నా రిహబిలిటేషన్ ప్రారంభిస్తాను. నేను వీలైనంత త్వరగా తిరిగి గ్రౌండ్‌లో అడుగుపెట్టడానికి ప్రయత్నిస్తాను' అని జడ్డూ రాసుకొచ్చాడు. అలాగే ఆసుపత్రిలో స్ట్రెచ్చర్ పట్టుకుని దిగిన ఫోటోను షేర్ చేశాడు. సర్జరీ చేయించుకునే క్రమంలో తనకు మద్దుగా నిలిచిన బీసీసీఐకి, సహచరులకు, సహాయక సిబ్బందికి, ఫిజియోలకు, వైద్యులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశాడు. ఈపోస్ట్ చూసిన అభిమానులు జడేజా తొందరగా కోలుకుని సాధ్యమైనంత త్వరగా గ్రౌండ్‌లో అడుగుపెట్టాలని కామెంట్లు పెడుతున్నారు.
ఇదిలా ఉంటే.. టీమ్ఇండియాలో జడేజా లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది. ఆసియా కప్ సూపర్-4లో పాక్‌తో, శ్రీలంకతో జరిగిన మ్యాచుల్లో జడేజా ఆడి ఉంటే ఫలితం వేరుగా ఉండేదని అభిమానులు అంటున్నారు. గ్రూప్ దశలో పాక్, హాంకాంగ్‌తో జరిగిన మ్యాచుల్లో జట్టు విజయాల్లో జడేజా తన వంతు పాత్ర పోషించాడు. పొట్టి ప్రపంచకప్‌కు మరో 40 రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఆలోగా జడేజా కోలుకుని బరిలోకి దిగతాడో లేదో అన్నది చెప్పడం కష్టంగా మారింది.
ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ కు జడేజా దూరం అయితే టీమ్ఇండియా విజయావకాశాలకు దెబ్బపడినట్లే.