అశ్విన్‌కు క‌రోనా.. ఆల‌స్యంగా ఇంగ్లాండ్‌కు

Ravichandran Ashwin tests COVID-19 positive.టీమ్ఇండియా స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్.. ఇంగ్లాండ్ కు కొంచెం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Jun 2022 4:51 AM GMT
అశ్విన్‌కు క‌రోనా.. ఆల‌స్యంగా ఇంగ్లాండ్‌కు

టీమ్ఇండియా స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్.. ఇంగ్లాండ్ కు కొంచెం ఆల‌స్యంగా బ‌య‌లుదేరి వెళ్ల‌నున్నాడు. అశ్విన్ క‌రోనా బారిన ప‌డ‌డ‌మే అందుకు కార‌ణం. ఇక ఇప్ప‌టికే ఇంగ్లాండ్ చేరుకున్న భార‌త జ‌ట్టు స‌భ్యులు ప్రాక్టీస్ మొద‌లెట్టారు. గ‌తేడాది క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డిన ఐదో టెస్ట్ మ్యాచ్ జులై 1 నుంచి ప్రారంభం కానుంది. సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న భార‌త్ చివ‌రి మ్యాచ్‌లో గెల‌వాల‌నే గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉంది.

కాగా.. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్)లో రాజ‌స్థాన్ త‌రుపున అశ్విన్ ఆడాడు. అనంత‌రం బ‌యో బ‌బుల్ వీడిన అత‌డు త‌మిళ‌నాడు క్రికెట్ అసోసియేష‌న్ డివిజ‌న్ 1 లీగ్ క్రికెట్ ఆడాడు. ఈ క్ర‌మంలోనే అశ్విన్‌కు క‌రోనా సోకింది. ప్ర‌స్తుతం అశ్విన్ క్వారంటైన్‌లో ఉన్నాడు. అందువ‌ల్లే అత‌డు జ‌ట్టుతో క‌లిసి ఇంగ్లాండ్‌కు వెళ్ల‌లేద‌ని ఓ బీసీసీఐ అధికారి చెప్పాడు. క‌రోనా నుంచి కోలుకున్నాక అశ్విన్‌ ఇంగ్లాండ్ కు వెళ‌తాడ‌ని ఆ అధికారి తెలిపాడు. శుక్ర‌వారం నుంచి లీకెస్టైర్‌షైర్‌తో ప్రారంభ‌మ‌య్యే నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌కు అశ్విన్ దూరం అయిన‌ట్లేన‌ని, ఇంగ్లాండ్‌తో టెస్టు నాటికి అశ్విన్ జ‌ట్టుతో క‌లిసే అవ‌కాశం ఉంద‌న్నాడు.

విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, ఛెతేశ్వర్ పుజారా, శార్దూల్ ఠాకూర్‌లతో కూడిన తొలి బ్యాచ్ ముంబై నుంచి జూన్ 16న లండన్‌కు చేరుకుంది. అయితే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాత్రం తొలి బ్యాచ్‌ వచ్చిన ఒక్క రోజు తర్వాత ఇంగ్లాండ్‌ చేరుకున్నాడు. మరోవైపు స్వదేశంలో దక్షిణాఫ్రికా సిరీస్‌లో పాల్గొన్న శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ త్వరలోనే టెస్టు జట్టుతో క‌ల‌వ‌నున్నారు. ఇక ఇప్ప‌టికే లీసెస్టర్‌షైర్‌ చేరుకున్న భారత ఆట‌గాళ్లు ప్రాక్టీస్‌ మొదలు పెట్టారు. నెట్స్‌లో ఆటగాళ్లు తీవ్రంగా చెమటోడుస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను లీసెస్టర్‌షైర్‌ కౌంటీ క్లబ్ సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.

Next Story