Ravichandran Ashwin : 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో 'ఒకే ఒక్కడు'
భారత స్టార్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తన టెస్టు కెరీర్‌లో గురువారం ఆరో సెంచరీని నమోదు చేశాడు.
By Medi Samrat Published on 20 Sept 2024 10:20 AM ISTభారత స్టార్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తన టెస్టు కెరీర్‌లో గురువారం ఆరో సెంచరీని నమోదు చేశాడు. ఈ సెంచరీ కారణంగా భారత్ భారీ స్కోరు సాధించింది. ఒకానొక సమయంలో 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన భారత్.. యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ భాగస్వామ్యంతో సత్తా చాటింది. ఆ తర్వాత అశ్విన్, జడేజాల రికార్డు భాగస్వామ్యం జట్టును 300కి తీసుకెళ్లింది. ఆరో సెంచరీతో అశ్విన్ తన పేరిట ఓ భారీ రికార్డు సృష్టించాడు. ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇంతకు ముందు ఎవరూ ఈ రికార్డు సృష్టించలేదు. ఈ రికార్డు గురించి తెలుసుకుందాం..
ఆరు సెంచరీలు కాకుండా ఇప్పటి వరకూ టెస్టుల్లో అశ్విన్ 14 హాఫ్ సెంచరీలు సాధించాడు. అంటే ఓవరాల్ గా 20కి పైగా అర్ధసెంచరీలు చేశాడు. ఇవి కాకుండా 30 సార్లకు పైగా ఐదు వికెట్లు తీసుకున్నాడు. అంటే అశ్విన్ ఒక ఇన్నింగ్స్‌లో 30 కంటే ఎక్కువ సార్లు ఐదు వికెట్లు తీసుకున్నాడు. అశ్విన్ 36 సార్లు ఐదు వికెట్లు పడగొట్టాడు. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో 20 అర్ధసెంచరీలు, 30కి పైగా మ్యాచ్‌లలో ఐదు వికెట్లు తీసిన తొలి క్రికెటర్‌గా అశ్విన్ రికార్డు సాధించాడు.
విశేషమేమిటంటే తన సొంతగడ్డపైనే ఈ ఘనత సాధించాడు. చెన్నైలో అతనికిది రెండో సెంచరీ. భారత్ స్కోరు ఒకానొక సమయంలో ఆరు వికెట్లకు 144 పరుగులు మాత్రమే. ఆ తర్వాత జడేజా, అశ్విన్ కలిసి బంగ్లాదేశ్ బౌలింగ్ లైనప్‌ను ధ్వంసం చేశారు. అశ్విన్ తన టెస్టు కెరీర్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు.
అశ్విన్ ఎనిమిది లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ టెస్ట్ మ్యాచ్‌లలో నాలుగు టెస్ట్ సెంచరీలు సాధించాడు. న్యూజిలాండ్ ఆల్-రౌండర్ డేనియల్ వెట్టోరి టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు సాధించాడు, ఎనిమిది లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్ చేసి ఐదు సెంచరీలు చేశాడు. చెపాక్ స్టేడియంలో 38 ఏళ్ల అశ్విన్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. అక్కడ ఐదు టెస్టులు ఆడి ఏడు ఇన్నింగ్స్‌ల్లో అశ్విన్ 55 కంటే ఎక్కువ సగటుతో 330+ పరుగులు చేశాడు. వీటిలో రెండు సెంచరీలు, ఒక అర్ధ సెంచరీ ఉన్నాయి.
అశ్విన్ చెపాక్‌లో 23.60 సగటుతో 30 వికెట్లు తీశాడు, 103 పరుగులకు ఏడు వికెట్లు అతని అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు. అత్యధికంగా ఐదు వికెట్లు, పలు సెంచరీలు చేసిన టాప్ ఆల్ రౌండర్లలో గార్ఫీల్డ్ సోబర్స్ (వెస్టిండీస్), కపిల్ దేవ్ (భారత్), క్రిస్ కెయిర్న్స్ (న్యూజిలాండ్), ఇయాన్ బోథమ్ (ఇంగ్లండ్) వంటి లెజెండ్‌ల సరసన అశ్విన్ చేరాడు.