Video : నితీష్‌రెడ్డి సెంచరీ.. కామెంట్రీ బాక్స్‌లో క‌న్నీళ్లు పెట్టుకున్న‌ లెజెండ్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024లో నాలుగో టెస్ట్ మ్యాచ్ మెల్‌బోర్న్‌లో జరుగుతోంది.

By Medi Samrat  Published on  28 Dec 2024 8:08 PM IST
Video : నితీష్‌రెడ్డి సెంచరీ.. కామెంట్రీ బాక్స్‌లో క‌న్నీళ్లు పెట్టుకున్న‌ లెజెండ్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024లో నాలుగో టెస్ట్ మ్యాచ్ మెల్‌బోర్న్‌లో జరుగుతోంది. మ్యాచ్ మూడో రోజు ఆటలో నితీష్ రెడ్డి అద్భుత సెంచరీ సాధించాడు. నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ మధ్య 8వ వికెట్‌కు 127 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. స్కాట్ బోలాండ్ బౌలింగ్ లో ఫోర్ కొట్టి నితీష్ రెడ్డి సెంచరీ పూర్తి చేశాడు. నితీష్ సెంచరీ తర్వాత వ్యాఖ్యానిస్తున్న భారత జట్టు మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి, మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్, టీవీ వ్యాఖ్యాత జతిన్ సప్రూల ఆనందానికి అవధులు లేవు.

నితీష్ సెంచరీ తర్వాత రవిశాస్త్రి తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. అంతేకాదు ఈ సమయంలో అతడి కళ్లలో నీళ్లు కూడా వచ్చాయి. కామెంట్రీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇవి వంద‌ల‌ కళ్లలో కన్నీళ్లు.. ఆ తండ్రికే కాదు, ఇక్కడ ఉన్న ప్రేక్షకులందరికీ కన్నీళ్లు వ‌స్తాయ‌ని నేను భావిస్తున్నానని పేర్కొన్నాడు. రవిశాస్త్రి మాత్రమే కాదు నితీష్ రెడ్డి తండ్రి కూడా సెంచరీ తర్వాత చాలా ఎమోషనల్ అయ్యాడు.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా విఫలమవడంతో.. నితీష్ రెడ్డి భారత జట్టును ఫాలోఆన్ నుంచి కాపాడాడు. నితీష్ ప్రస్తుతం 176 బంతుల్లో 105 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. మ్యాచ్ ఫ‌లితంపై అనుమానాలు ఉన్నాయి. ఈ టెస్ట్ కూడా డ్రాగా ముగిసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 తొలి టెస్టులో నితీష్ రెడ్డి అరంగేట్రం చేశాడు. విరాట్ కోహ్లి పెర్త్‌లో నితీష్ రెడ్డికి అరంగేట్రం క్యాప్‌ను అందించాడు. నితీష్ రెడ్డి ప్రస్తుతం తన కెరీర్‌లో నాలుగో టెస్టు మ్యాచ్‌ను ఆడుతున్నాడు. అతను 4 టెస్టుల్లో 6 ఇన్నింగ్స్‌లలో 71.00 సగటుతో మరియు 66.98 స్ట్రైక్ రేట్‌తో 284 పరుగులు చేశాడు. ఇందులో ఒక‌ సెంచరీ కూడా సాధించాడు. నితీష్‌ పెర్త్ టెస్టులో 41-38* పరుగులు, రెండో టెస్టులో 42-42 పరుగులు, బ్రిస్బేన్ టెస్టులో 16 పరుగులు చేశాడు.

Next Story