హిట్‌మ్యాన్.. మరో మూడు రోజుల్లో ఆసీస్ వెళ్లకపోతే..!
Ravi Shastri About Rohit Sharma, Ishant Sharma
By Medi Samrat
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గాయపడిన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మలు ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో కోలుకుంటున్నారు. వీరిద్దరూ కూడా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ఎంపికైన విషయం తెలిసిందే. అయితే.. వీరు ఎప్పుడు ఆసీస్‌కు పయనమవుతారనే విషయంపై బీసీసీఐ(భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు) ఇప్పటి వరకు ప్రకటించలేదు. అయితే.. మరో మూడు, నాలుగు రోజుల్లో రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మలు కంగారూల గడ్డకు చేరుకోవాలని లేనిపక్షంలో వారిద్దరికీ టెస్టు సిరీస్‌లో ఆడే అవకాశాలు కఠినంగా మారుతాయని టీమ్ఇండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి తెలిపారు.
కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రస్తుతం ఆస్ట్రేలియాలో 14 రోజుల క్వారంటైన్ నిబంధనలు అమల్లో ఉంది. దీంతో వారిద్దరూ సోమవారమే ఆసీస్ బయల్దేరకపోతే.. డిసెంబర్ 6న ఆస్ట్రేలియా-ఏ జట్టుతో జరిగే తొలి వార్మప్ మ్యాచ్‌కు దూరం అవుతారు. డిసెంబర్ 11న రెండో వార్మప్ మ్యాచ్ జరగనుంది. "పరిమిత ఓవర్ల సిరీస్‌కు రోహిత్ లేడు. అతడు ఎంతసేపు విశ్రాంతి తీసుకోవాలనే విషయంపై ఎన్‌సీఏ మెడికల్ టీం ఆలోచిస్తున్నారు. రోహిత్ టెస్టు సిరీస్ ఆడాలంటే అతడు ఎక్కువ కాలం ఇండియాలో ఉండకూడదు. మరో మూడు నుంచి నాలుగు రోజుల్లో ఆసీస్ రావాలి. లేనిపక్షంలో అవకాశాలు కఠినంగా మారుతాయి. ఆసీస్ బయలుదేరడానికి ఎక్కువ సమయం తీసుకుంటే క్వారంటైన్ నిబంధనలతో తర్వాత సవాలుగా మారుతుంది. ఇషాంత్ శర్మకి కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది" అని టీమ్ఇండియా కోచ్ రవిశాస్త్రి అన్నాడు.
నవంబర్ 27 నుంచి ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా సుదీర్ఘ పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. డిసెంబర్ 17 నుంచి అడిలైడ్ వేదికగా తొలి డే అండ్ నైట్ టెస్టు ప్రారంభం అవుతుంది. తొలి టెస్టు అనంతరం విరాట్ కోహ్లీ భారత్ రానున్నాడు.