ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం లభించింది. గురువారం జరిగిన పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ విభాగం ఫైనల్ లో రవి కుమార్ దహియా.. ప్రత్యర్ధి యుగేవ్ జావుర్ మీద 4-7 తేడాతో ఓటమిపాలయ్యాడు. దీంతో రవి దహియా రజతంతో మెరిశాడు. రష్యాకు చెందిన యుగేవ్ జావుర్ రవిని ఓడించి స్వర్ణం సాధించాడు. ఇదిలావుంటే.. 2012 తర్వాత రెజ్లింగ్ పురుషుల విభాగంలో భారత్‌కు పతకం సాధించాడు. అంతకుముందు సుశీల్‌కుమార్ 2008లో కాంస్య పతకం సాధించగా.. 2012లో రజత పతకం సాధించాడు. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు రవికుమార్ రెజ్లింగ్‌లో రజత పతకం సాధించడం విశేషం.
రవి కుమార్ దహియా రజతం గెలుచుకోవడంతో టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ సాధించిన పతకాల సంఖ్య ఐదుకు చేరింది. ఇప్పటికే వెయిట్ లిఫ్టర్ మీరా బాయి చాను రజతం, షట్లర్ పీవీ సింధు కాంస్య పతకం, బాక్సర్ లవ్లీనా బోర్గొహైన్ కాంస్యం, పురుషుల హాకీ టీం కాంస్య పతకం గెలుచుకున్నారు. రవి దహియా రజతం సాధించడం పట్ల భారత క్రీడాభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ, హోంమంత్రి అమిత్ షా ట్విటర్ వేదికగా దహియాకు శుభాకాంక్షలు తెలియజేశారు.