ఆఫ్ఘనిస్తాన్ లో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాల నేఫథ్యంలో ఆ దేశం తరపున క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్ల పరిస్థితి ఏమిటా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఐపీఎల్ లో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు అదరకొట్టారు. సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున మొహమ్మద్ నబీ, రషీద్ ఖాన్ ఆడుతూ ఉన్నారు. అయితే.. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్ లీగ్‌లో తమ జట్టుకు ఆడాల్సిన రషీద్ ఖాన్, మహ్మద్ నబీలు అందుబాటులో ఉంటారని సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రకటించింది.
ఎస్‌ఆర్‌హెచ్ ఫ్రాంఛైజీ సీఈవో షణ్ముగం మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌లో ఏం జరుగుతుందన్న దానిపై మేము మాట్లాడదలుచుకోలేదని.. తమ జట్టుకు ప్రాతినిధ్యం వహించే ఆ దేశ క్రికెటర్లు మాత్రం లీగ్‌కు అందుబాటులో ఉంటారని చెప్పగలనని అన్నారు. ఈ నెల 31న ఎస్‌ఆర్‌హెచ్ జట్టు యూఏఈకి బయలుదేరబోతుందని షణ్ముగం వెల్లడించారు.
ప్రస్తుతం రషీద్ ఖాన్, నబీ ఇద్దరూ హండ్రెడ్ టోర్నీ కోసం యూకేలో ఉన్నారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తన కుటుంబాన్ని అక్కడి నుంచి ఎలా బయటకు తీసుకురావాలన్న దానిపై రషీద్ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ తెలిపాడు. కాబూల్ ఎయిర్‌స్పేస్ మూసేయడంతో అక్కడి నుంచి వివిధ దేశాలకు విమాన రాకపోకలు నిలిచిపోయాయి.