ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్ జట్టు 3-0తో అవమానకరమైన రీతిలో ఓటమి పాలైంది. ఇంగ్లండ్ ఊహించని విధంగా క్లీన్‌స్వీప్ చేయడంతో పాక్ సెలెక్షన్ కమిటీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) ఛైర్మన్ రమీజ్ రాజాను ఆ పదవి నుండి తొలగించారు. పీసీబీలో రాజా స్థానంలో నజామ్ సేథి బాధ్యతలు స్వీకరించాడు. సేథీ గతంలో 2013 నుంచి 2014 వరకు పీసీబీ చైర్మన్‌గా పనిచేశారు. గత ఏడాది మూడేళ్ల పదవీ కాలానికి ఎన్నికైన రమీజ్ రాజా హయాంలో పాకిస్థాన్ ప్రదర్శన చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు.
ఆసియా కప్ 2022 ఫైనల్‌లో శ్రీలంకపై ఓడిపోయారు. T20 ప్రపంచ కప్ 2022 లో కూడా ఇంగ్లాండ్‌తో ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచారు. అయితే అదృష్టం కొద్దీ పాక్ ఫైనల్ కు చేరిందని అందరికీ తెలిసిందే..! చాలా మంది మాజీ పాకిస్తాన్ క్రికెటర్లు రమీజ్ రాజా సెలెక్ట్ చేసిన జట్టుపై తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాకుండా రమీజ్ రాజా పీసీబీ ఛైర్మన్‌గా నియమితులైనప్పటి నుండి అతనిని కొందరు టార్గెట్ చేశారు. ఇక వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్ నుంచి వైదొలుగుతామని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)ని కూడా రమీజ్ రాజా బెదిరించడం హాట్ టాపిక్ గా మారింది.