సిరీస్ క్లీన్ స్వీప్.. ఎన్నో రికార్డులు..!
శుభ్‌మన్ గిల్ సారథ్యంలో అహ్మదాబాద్‌లో ప్రారంభమైన విజయాల పరంపర ఢిల్లీలోనూ కొనసాగింది.
By - Medi Samrat |
శుభ్‌మన్ గిల్ సారథ్యంలో అహ్మదాబాద్‌లో ప్రారంభమైన విజయాల పరంపర ఢిల్లీలోనూ కొనసాగింది. మంగళవారం రెండో, చివరి టెస్టులో భారత్ ఏడు వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించి రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తో కైవసం చేసుకుంది. ఈ విజయంతో టీమ్ ఇండియా క్లీన్ స్వీప్ నమోదు చేయడమే కాకుండా ఎన్నో చారిత్రక రికార్డులను తన పేరిట లిఖించుకుంది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని యువ జట్టు స్వదేశంలో భారత్‌ను ఓడించడం అంత సులభం కాదని మరోసారి నిరూపించింది. ఇంగ్లండ్‌లో సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకున్న తర్వాత గిల్ కెప్టెన్సీలో సిరీస్ గెలవడం ఇదే తొలిసారి.
ఢిల్లీ టెస్ట్ విజయంలో హీరో యశస్వి జైస్వాల్. అతడు మొదటి ఇన్నింగ్స్‌లో 178 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్ మ్యాచ్ దిశను నిర్ణయించింది. అతనితో పాటు, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా 129 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరి బలమైన భాగస్వామ్యం భారత్‌ను మొదటి ఇన్నింగ్స్‌లో 518 పరుగుల వద్ద డిక్లేర్ చేసే స్థితిలో ఉంచింది. రెండో ఇన్నింగ్స్‌లో జైస్వాల్ ఆరంభంలోనే ఔటైనా, కేఎల్ రాహుల్ తన అనుభవాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నాడు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించిన రాహుల్ 58 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఐదో రోజు భారత్ విజయానికి 58 పరుగులు మాత్రమే కావాలి. ఒక వికెట్‌కు 63 పరుగులతో ఉన్న టీమిండియా.. ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లింది.
ఈ విజయంతో వెస్టిండీస్‌పై భారత్ వరుసగా 10 టెస్టు సిరీస్‌లను గెలుచుకుంది. 2002 నుంచి ఈ క్రమం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే వెస్టిండీస్‌ను వరుసగా 10 సార్లు ఓడించిన దక్షిణాఫ్రికా రికార్డును భారత్ సమం చేసింది. చివరిసారిగా 2002లో వెస్టిండీస్ చేతిలో భారత్ పరాజయం పాలైంది.
వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ధృవ్ జురెల్ ఇండియా ఇప్పటి వరకు ఆడిన అన్ని టెస్టుల్లోనూ భారత్ విజయం సాధించింది. 2024లో ఇంగ్లండ్‌తో జరిగిన రాజ్‌కోట్ టెస్టుతో కెరీర్ ప్రారంభించాడు. జురెల్ ఇప్పటివరకు ఏడు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఎందులో భారత్ ఓడిపోలేదు.
ఈ విజయంతో భారత్ స్వదేశంలో మొత్తం 122 టెస్టు విజయాలు సాధించి, దక్షిణాఫ్రికా (121)ను వెనక్కి నెట్టి మూడో స్థానానికి చేరుకుంది. అయితే సిరీస్ ఓటమికి గురైనప్పటికీ ఢిల్లీ టెస్టులో వెస్టిండీస్ పోరాట పటిమను ప్రదర్శించింది. క్యాంప్‌బెల్, హోప్‌ల సెంచరీ భాగస్వామ్యం భారత బౌలర్లను చాలాసేపు నిరీక్షించేలా చేసింది. 2025లో వెస్టిండీస్ జట్టు ఇన్నింగ్స్‌లో 300కి పైగా పరుగులు చేయడం ఇదే తొలిసారి. జాన్ క్యాంప్‌బెల్ తన కెరీర్‌లో 50వ టెస్ట్ ఇన్నింగ్స్‌లో తన మొదటి సెంచరీని సాధించాడు. షాయ్ హోప్ 2,968 రోజుల తర్వాత తన మూడో టెస్టు సెంచరీని సాధించి సుదీర్ఘ కరువును ముగించాడు.
కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌కు ఈ సిరీస్ చిరస్మరణీయం. అహ్మదాబాద్ టెస్టులో ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో విజయం సాధించిన తర్వాత, అతను ఢిల్లీలో కూడా విజయంతో తన కెప్టెన్సీ అరంగేట్రం విజయవంతమయ్యాడు. గిల్ కెప్టెన్సీలో జట్టు సంయమనం, యువ ఉత్సాహం, సమష్టి ప్రదర్శన స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సిరీస్ ముగియడంతో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత్ ఇప్పుడు ఆస్ట్రేలియాకు బయలుదేరుతుంది. స్వదేశంలో జరిగిన సిరీస్‌లో అద్భుతమైన ఆటతీరుతో టీమిండియా ఆత్మవిశ్వాసం తారాస్థాయికి చేరింది.