రాజస్థాన్ రాయల్స్ జట్టు యాజమాన్యం తమ ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ మార్చి 12 బుధవారం ప్రీ-సీజన్ శిక్షణా శిబిరంలో తిరిగి చేరనున్నట్లు ధృవీకరించింది. ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు పూర్తి స్థాయిలో రాజస్థాన్ జట్టు సభ్యులు శిక్షణ పొందుతున్నారు. అయితే రాహుల్ ద్రావిడ్ కు గాయం అవ్వడంతో జట్టుతో ఆయన చేరడానికి సమయం పట్టింది. బెంగళూరులో క్రికెట్ ఆడుతున్నప్పుడు ద్రవిడ్ కాలికి గాయమైందని, మార్చి 22 నుండి ప్రారంభమయ్యే కొత్త సీజన్‌కు ముందు శిక్షణ పొందుతున్న జట్టుతో ఆయన లేరని రాజస్థాన్ టీమ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
రాజస్థాన్ రాయల్స్ షర్ట్‌లో ఫోటోకు పోజులిచ్చేటప్పుడు ద్రవిడ్ ఎడమ కాలుకు గాయంతో కనిపించారు. బెంగళూరులో క్రికెట్ ఆడుతున్నప్పుడు గాయపడిన రాహుల్ ద్రవిడ్ ప్రస్తుతం కోలుకుంటున్నారని ఫ్రాంచైజీ తెలిపింది. 52 ఏళ్ల ద్రవిడ్ ఇటీవలే పోటీ క్రికెట్‌లోకి తిరిగి వచ్చారు. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) గ్రూప్ III లీగ్ సెమీఫైనల్‌లో విజయ క్రికెట్ క్లబ్ తరపున తన 16 ఏళ్ల కుమారుడు అన్వేతో కలిసి ఆడారు.