రహానే కెప్టెన్ ఇన్నింగ్స్.. 82 పరుగుల ఆధిక్యంలో భారత్
Rahaney Makes Century In Second Test. మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత తాత్కాలిక
By Medi Samrat Published on 27 Dec 2020 7:37 AM GMTమెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానే(104 నాటౌట్) శతకంతో సత్తా చాటడంతో రెండో రోజు ఆటముగిసే సమయానికి భారత్ ఐదు వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ 82 పరుగుల ఆధిక్యంలో ఉంది. రహానేకు తోడుగా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (40 నాటౌట్) క్రీజులో ఉన్నాడు.
వికెట్ నష్టానికి 36 పరుగులతో రెండో రోజు బ్యాటింగ్ ఆరంభించిన భారత్‌కు కష్టాలు తప్పలేవు. అరంగ్రేటం ఆటగాడు శుభ్‌మన్ గిల్ (45) బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగెత్తించగా.. చతేశ్వర పుజారా (17) క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 61 పరుగులు జోడించారు. ఈ జోడి ప్రమాదకరంగా మారుతున్న తరుణంలో ప్యాట్ కమిన్స్ మాయాజాలం చేశాడు. స్వల్ప తేడాతో ఇద్దరిని పెవిలియన్ చేర్చాడు. దీంతో భారత్ 64 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యతను కెప్టెన్ రహానే మీద వేసుకున్నాడు. హనుమ విహారీ(21)తో కలిసి నాలుగో వికెట్‌కు 52 పరుగులు, రిషబ్ పంత్(29)తో కలిసి ఐదో వికెట్‌కు 57 పరుగులు జోడించాడు.
ఓవైపు వికెట్లు పడుతున్నా.. రహానే అచితూచి ఆడాడు. మంచి బంతులను గౌరవిస్తూనే చెత్త బంతులను బౌండరీకి తరలించాడు. రహానేకు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కలిసాక మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. వీరిద్దరు ఆసీస్ బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. మరోవికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూనే స్కోర్ వేగాన్ని పెంచారు. వీరిద్దరు అభేద్యమైన ఆరో వికెట్‌కు 104 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో రహానే టెస్టులో 12వ శతకాన్ని నమోదు చేశాడు. కమిన్స్ వేసిన ఇన్నింగ్స్ 88వ ఓవర్లో ఫోర్ కొట్టడం ద్వారా రహానే ఈ మైలురాయిని అందుకున్నాడు. మొత్తం 195 బంతుల్లో 11 ఫోర్లతో మూడంకెల స్కోరును అందుకున్నాడు. రహానే శతకం సాధించిన కొద్దిసేపటికే వెలుతురు లేమితో రెండో రోజు ఆటను ముగించారు. ప్రస్తుతం భారత్ 82 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక మూడోరోజు భారత బ్యాట్స్‌మెన్లు ఎంత ఆధిక్యాన్ని అందిస్తారు అన్నదానిపై మ్యాచ్ ఫలితం ఆదారపడి ఉంటుంది.