అక్కడి నుంచే జట్టు పరిస్థితి మరింత దిగజారింది.. ఓటమికి నాదే బాధ్యత : రహానే

మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమికి కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్యా రహానే బాధ్యత వహించాడు.

By Medi Samrat
Published on : 16 April 2025 9:58 AM IST

అక్కడి నుంచే జట్టు పరిస్థితి మరింత దిగజారింది.. ఓటమికి నాదే బాధ్యత : రహానే

మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమికి కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్యా రహానే బాధ్యత వహించాడు. పంజాబ్ నిర్దేశించిన 112 పరుగుల లక్ష్యాన్ని కోల్ కతా పటిష్ట బ్యాటింగ్ ఆర్డర్ అందుకోలేకపోయింది. ముల్లన్‌పూర్‌లో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 12 పరుగుల తేడాతో కోల్‌కతాపై విజయం సాధించింది.

లక్ష్య ఛేదనలో కోల్‌కతా జట్టు 15.1 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌటైంది. ఆండ్రీ రస్సెల్ చివరి వరకు నిలబడి జట్టుకు విజయాన్ని అందించాలని ప్రయత్నించాడు. అయితే మార్కో జాన్సెన్ అతనిని బౌల్డ్ చేసి కోల్‌కతా ఇన్నింగ్స్‌ను ముగించి తన జట్టుకు గొప్ప విజయాన్ని అందించాడు.

మ్యాచ్ అనంతరం కోల్‌కతా కెప్టెన్ రహానే.. ఓటమికి ఎవరినీ నిందించకుండా పూర్తి బాధ్యత తనపై వేసుకున్నాడు. ఈ పరాజయానికి నేనే బాధ్యత వహిస్తున్నాను అని రహానే అన్నాడు, నేను తప్పుడు షాట్ ఆడాను. అక్కడి నుంచి జట్టు పరిస్థితి మరింత దిగజారింది. నాకు ఖచ్చితంగా తెలియనందున నేను DRS వంటి అవకాశాలను తీసుకోవాలనుకోలేదు. వికెట్‌పై బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదు.. అయితే 111 పరుగులు ఛేదించాల్సి వచ్చింది. బ్యాటింగ్ యూనిట్‌గా మేము చాలా ఘోరంగా ఆడాము. పంజాబ్ బలమైన బ్యాటింగ్ ఆర్డ‌ర్‌పై మా బౌలర్లు అద్భుతంగా పనిచేశారు.. బ్యాటింగ్‌లో కొంత మేము నిర్లక్ష్యంగా ఉన్నామని నేను భావిస్తున్నాను. యూనిట్‌గా పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. నేను ప్రశాంతంగా ఉండాలి.. జట్టుకు నేను ఏమి చెబుతానో ఆలోచించాలి అని అన్నాడు.

ఈ మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ జట్టుకు వేగంగా శుభారంభం అందించగా.. ఈ జోడీ పెవిలియన్‌కు చేరిన వెంటనే పంజాబ్ బ్యాట్స్‌మెన్‌లు ఒక‌రి త‌ర్వాత ఒక‌రు త్వ‌ర‌గా ఔటయ్యారు. ప్రభాసిమ్రన్ 15 బంతుల్లో 30 పరుగులు చేశాడు. ప్రియాంష్ 12 బంతుల్లో 22 పరుగులు చేశాడు. కోల్‌కతా తరఫున హర్షిత్ రాణా మూడు వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ చెరో రెండు వికెట్లు తీశారు. వైభవ్ అరోరా, ఎన్రిక్ నోర్కియా చెరో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా సులువుగా గెలుస్తుందని అనిపించినా, లక్ష్యాన్ని కాపాడుకోవడానికి పంజాబ్ బౌలర్లు అద్భుతాలు చేశారు. కోల్‌కతా నుంచి కేవలం ముగ్గురు బ్యాట్స్‌మెన్ మాత్రమే రెండంకెల స్కోరును అందుకోగలిగారు. అంగ్క్రిష్ రఘువంశీ 28 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 37 పరుగులు చేశాడు. రహానే 17 పరుగులు, రస్సెల్ 17 పరుగులు చేశారు. పంజాబ్ బౌల‌ర్ల‌లో చాహ‌ల్ నాలుగు, జాన్స‌న్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టారు.

Next Story