అతడిని రెండేళ్ల పాటు టెస్ట్ కెప్టెన్ చేయండి..!
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల టెస్ట్ రిటైర్మెంట్ భారత జట్టులో పెద్ద మార్పును తెచ్చిపెట్టింది.
By Medi Samrat
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల టెస్ట్ రిటైర్మెంట్ భారత జట్టులో పెద్ద మార్పును తెచ్చిపెట్టింది. ఐదు టెస్టుల సిరీస్ కోసం టీమ్ ఇండియా జూన్‌లో ఇంగ్లాండ్‌లో పర్యటించాల్సి ఉంది. దాని కోసం కొత్త కెప్టెన్ కోసం వెతుకుతోంది. ఈ రేసులో శుభమాన్ గిల్ పేరు ముందంజలో ఉంది. జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్ పేర్లు కూడా చర్చనీయాంశమయ్యాయి.
భారత జట్టు మాజీ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టు కెప్టెన్ కోసం అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియా ఇచ్చాడు. రోహిత్-విరాట్ తర్వాత అత్యంత అనుభవజ్ఞుడైన ఆటగాడు రవీంద్ర జడేజాను రెండేళ్ల పాటు టెస్టు కెప్టెన్‌గా నియమించాలని అన్నాడు.
రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ 'ఆష్ కీ బాత్'లో మాట్లాడుతూ.. 'రవీంద్ర జడేజా జట్టులో అత్యంత అనుభవజ్ఞుడైన ఆటగాడు అని మేము చెప్పడం లేదు. మీరు కొత్త వ్యక్తికి శిక్షణ ఇవ్వాలనుకుంటే, జడేజాను రెండేళ్ల పాటు కెప్టెన్‌గా చేసి, అతని నాయకత్వంలో యువ ఆటగాడిని వైస్ కెప్టెన్‌గా చేయండని మేనేజ్‌మెంట్‌కు సలహా ఇచ్చాడు.
టీమ్‌కి ఆడిన తర్వాత భారత్‌కు కెప్టెన్‌గా ఉండాలని మేమంతా కోరుకుంటాం. రవీంద్ర జడేజాకు కూడా ఈ కల ఉంటుంది. అతడు చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.. అతను కెప్టెన్ అవ్వాలని నేను చెప్పడం లేదు, కానీ అతని పేరు ఖచ్చితంగా పరిగణించాలన్నాడు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టెస్ట్ రిటైర్మెంట్ తర్వాత, కొత్త జట్టును సిద్ధం చేయాల్సిన ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ దృష్టి మొత్తం పడింది. భారత కెప్టెన్ ఎంపికలో గంభీర్ పెద్ద పాత్ర పోషించాల్సి ఉంటుందని అశ్విన్ అన్నాడు.
అశ్విన్ మాట్లాడుతూ, 'ఏ జట్టును ఎంపిక చేసినా అది గౌతమ్ గంభీర్ జట్టునే. రవీంద్ర జడేజాతో పాటు గంభీర్‌కు అత్యంత అనుభవజ్ఞుడైన ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు. గంభీర్ జట్టును విస్తరించాల్సిన అవసరం ఉన్నందున కెప్టెన్ నియామకంలో పెద్ద పాత్ర పోషించాల్సి ఉంటుందన్నాడు.