భారత్‌పై ఓటమి.. టెస్టులకు క్వింటన్ డికాక్ గుడ్‌బై
Quinton de Kock announces retirement from Test cricket.సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమ్ఇండియా
By తోట వంశీ కుమార్ Published on 31 Dec 2021 3:13 AM GMTసెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమ్ఇండియా 113 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ఓడిపోయి బాధల్లో ఉన్న సౌతాఫ్రికా జట్టుకు మరో షాక్ తగింది. దక్షిణాఫ్రికా వికెట్ కీపర్, బ్యాటర్ క్వింటన్ డికాక్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. సుదీర్ఘ ఫార్మెట్(టెస్టు క్రికెట్) కు వీడ్కోలు పలికాడు. తాను తీసుకున్న ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని చెప్పాడు. డికాక్ టెస్టు రిటైర్మెంట్ విషయాన్ని క్రికెట్ సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది. అయితే.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం కొనసాగుతాడని చెప్పింది.
కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డికాక్ వెల్లడించాడు. 'ఇది అంత తేలికగా తీసుకున్న నిర్ణయం కాదు. చాలా ఆలోచించా. నాకు కుటుంబమే తొలి ప్రాధాన్యం. త్వరలో నా భార్య సాషా తొలి బిడ్డకు జన్మనివ్వనుంది. భవిష్యత్ గురించి చాలా ఆలోచించా. ఈ సమయంలో ఎక్కువ సమయం కుటుంబానికే కేటాయించాలని నిర్ణయించుకున్నా.' అని డికాక్ తెలిపాడు. ఇక తనకు టెస్టు క్రికెట్ అంటే ఎంతో ఇష్టం అని, క్రికెట్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశానని చెప్పుకొచ్చాడు. తన టెస్టు క్రికెట్ ప్రయాణంలో తనతో పాటు కలిసి ప్రయాణించిన తన సహచరులకు ధన్యవాదాలు చెప్పాడు.
సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో డికాక్ తొలి ఇన్నింగ్స్‌లో 34, రెండో ఇన్నింగ్స్‌లో 21 పరుగులు చేశాడు. ఇక ఇప్పటి వరకు డికాక్ 54 టెస్టుల్లో 3,300 పరుగులు చేశాడు. ఇందుల్లో 6 సెంచరీలు, 22 అర్థశతకాలు ఉన్నాయి.