PV Sindhu Won Against Yamaguchi. టోక్యో ఒలింపిక్స్‌లో భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు అద్భుతమైన
By Medi Samrat Published on 30 July 2021 9:30 AM GMT
టోక్యో ఒలింపిక్స్‌లో భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శిస్తోంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ పైనల్‌లో సింధు జపాన్ క్రీడాకారిణి యమగుచితో తలపడింది. వీరిద్దరు ఇప్పటివరకూ 18 సార్లు తలపడగా.. పీవీ సింధు 11 సార్లు విజయం సాధించగా, యమగుచి 7 సార్లు పైచేయి సాధించింది. ఇక ఈ క్వార్టర్ పైనల్ తొలి గేమ్‌లో ప్రత్యర్థిపై సింధు పైచేయి సాధించింది. మ్యాచ్ ఆరంభంలో కాస్త తడబడిన సింధు ఆ తర్వాత పుంజుకుంది.
తొలి బ్రేక్‌లో 11-7తో ఆధిపత్యం ప్రదర్శించింది. విరామం తర్వాత యమగుచి కాస్త దూకుడు ప్రదర్శించినా సింధు కట్టడి చేసింది. 21-13తో తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. ఇక రెండో గేమ్‌లో సింధు, యమగుచిల మధ్య పోరు హోరాహోరిగా మారింది. తొలి నుండి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ వస్తోన్న పీవీ సింధు స్కోరును 15-15 వద్ద యమగుచి సమం చేసింది. ఆ తర్వాత ప్రతి పాయింటు కోసం ఇరువురు హోరాహోరిగా తలపడ్డారు. ఓ దశలో 20-18తో వెనకబడ్డ సింధు.. తర్వాత తేరుకుని 21-20తో మ్యాచ్‌ను గెలిచింది. సొంతగడ్డపై యమగుచిని మట్టికరిపించి తదుపరి రౌండ్‌లోకి అడుగుపెట్టింది. వరుస సెట్లలో మ్యాచ్ ముగియగా.. ఈ గెలుపుతో సింధు సెమీస్‌కు చేరుకుంది.