ఫైనల్లో ఓడిన పీవీ సింధు

PV Sindhu Settles For Silver After Going Down Against South Korean An Seyoung. బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో భారత స్టార్‌

By Medi Samrat  Published on  5 Dec 2021 9:57 AM GMT
ఫైనల్లో ఓడిన పీవీ సింధు

బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు ఓటమిపాలైంది. ఇండోనేసియాలోని బాలిలో జరిగిన మహిళల సింగిల్స్‌ టైటిల్‌ పోరులో ఆన్ సియాంగ్‌ (దక్షిణకొరియా) చేతిలో సింధు ఓడిపోయింది. వరుస సెట్లలో 10-21, 12-21 తేడాతో ఓడిన సింధు.. రన్నరప్‌గా నిలిచింది. దాంతో ఈ ఏడాది ఒక్క అంతర్జాతీయ టైటిల్‌ కూడా సింధు ఖాతాలో చేరలేదు. వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో తుది పోరుకు చేరడం సింధుకు ఇది మూడోసారి. 2018 సీజన్‌లో తెలుగు తేజం వరల్డ్‌ టూర్‌ టైటిల్‌ కైవసం చేసుకుంది. కేవలం 39 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత సింధు ని తిరిగి పుంజుకోడానికి ఆన్ సియాంగ్‌ అనుమతించలేదు. బేస్‌లైన్ గేమ్‌తో పాటూ నెట్‌ప్లేలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ఆన్ సియాంగ్‌ సింధును మట్టికరిపించింది.

ఈ టోర్నీలో సింధు ఫైనల్‌కు చేరడం ఇది మూడోసారి. ఆమె 2018లో టైటిల్‌ను గెలుచుకుని, ఈ ఘనత సాధించిన ఏకైక భారతీయురాలుగా చరిత్ర లిఖించింది. సింధు మొదటి గేమ్ చివరి దశలలో పోరాడినా.. దక్షిణ కొరియా స్టార్ అద్భుతమైన స్మాష్‌తో ముగించడంతో సింధు పుంజుకోలేకపోయింది. రెండవ గేమ్‌లో సింధు ప్రతిఘటించినప్పటికీ విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో కేవలం రెండు సెట్లలోనే ఓటమి పాలైంది. అంతకుముందు జరిగిన సెమీస్‌లో సింధు 21-15 15-21 21-19 తేడాతో జపాన్‌కు చెందిన అకానె యమగుచిని ఓడించి ఫైనల్ కు చేరుకుంది.


Next Story
Share it