టోక్యో ఒలింపిక్స్ : సెమీస్ లో సింధు ఓటమి

PV Sindhu Lost Badminton Semis In Tokyo Olympics. ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు

By Medi Samrat  Published on  31 July 2021 11:29 AM GMT
టోక్యో ఒలింపిక్స్ : సెమీస్ లో సింధు ఓటమి

ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఓటమిపాలైంది. శ‌నివారం జరిగిన సెమీఫైనల్స్‌లో చైనీస్‌ తైపీ క్రీడాకారిణి తై జు యింగ్‌ చేతిలో 18-21, 12-21 తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్‌ ప్రారంభంలో కాస్త ఆధిపత్యం చెలాయించిన సింధు.. తొలి విరామం తర్వాత వెనుకపడింది. ఈ క్రమంలోనే అనూహ్యంగా పుంజుకున్న తై జు తర్వాత సింధూకు గట్టి పోటీ ఇచ్చింది. చివరికి తొలి గేమ్‌ను 21-18తో కైవసం చేసుకుంది. ఆపై మరింత పట్టుదలగా ఆడిన ఆమె.. రెండో గేమ్‌లోనూ సింధుకు అవ‌కాశ‌మివ్వ‌కుండా గేమ్‌ను సొంతం చేసుకుంది.

సింధు, తై జు ఇప్ప‌టివ‌ర‌కూ 18 సార్లు తలపడగా.. 13సార్లు తై జునే పైచేయి సాధించింది. 5సార్లు మాత్రమే సింధు ఆమెపై పైచేయి సాధించింది. అయితే.. 2016 రియో ఒలింపిక్స్, 2019 ప్రపంచ చాంపియన్‌షిప్, 2018 ప్రపంచ టూర్ ఫైనల్స్‌లో వంటి కీలక టోర్నీల్లో తై జును ఓడించి సింధు సత్తా చాటింది. దీంతో అదే జోరును ఇప్పుడు కూడా చూపుతుందని భావించినప్పటికీ నిరాశే ఎదురైంది. స్వర్ణం గెలుస్తుంద‌ని ఎన్నో ఆశ‌ల‌తో ఉన్న అభిమానుల ఆశ‌లు అడియాశ‌ల‌య్యాయి. ఇక సింధు రేపు కాంస్యం కోసం జరిగే మ్యాచ్ లో ఆడనుంది.


Next Story