ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ స్టార్ సింధూపై కోట్లాది భారతీయులు పెట్టుకున్న ఆశలు నెరవేరాయి. నిన్న జరిగిన సెమీస్‌లో ఓడినప్పటికీ.. నేడు కాంస్యం కోసం జరిగిన పోరులో పీవీ సింధు జయకేతనం ఎగురవేసి పతకం కొల్లగొట్టింది. టోక్యో ఒలింపిక్స్ లో భాగంగా ఆదివారం చైనాకు చెందిన హి బింగ్జియావోతో జరిగిన మ్యాచ్‌లో సింధు 21-13, 21-15 తేడాతో వరుస గేమ్స్‌లో విజయం సాధించింది. కాంస్య పతాకాన్నిగెలిచి చరిత్ర సృష్టించింది. తద్వరా ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ గెలిచిన తొలి భారతీయ మహిళగా రికార్డుకెక్కింది.
తొలి సెట్ నుంచే దూకుడుగా ఆడిన పీవీ సింధు.. చివరి వరకూ ఆధిపత్యం ప్రదర్శించింది. 21-13తో ఫస్ట్ గేమ్‌ను అలవోకగా ముగించేసింది. రెండో సెట్ ను కూడా దూకుడుగా ఆరంభించిన సింధుపై.. మధ్యలో కాసేపు హి బింగ్జియావో 11-11తో ఆధిక్యాన్ని ప్రదర్శించి సమం చేసింది. కానీ.. సింధు వెంటనే తేరుకుని వరుసగా నాలుగు పాయింట్లు సాధించి 15-11, 18-14, 19-15 ఇలా చూస్తుండగానే సెట్‌ని 21-15తో కైవసం చేసుకుంది. 53 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్ లో సింధు విజయం సాధించడంతో.. ఈ ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండవ పతకం దక్కింది.