ఒకప్పుడు ఐపీఎల్ లో స్టార్ పేసర్.. ఇప్పుడేమో నెట్ బౌలర్
Purple Cap winner Mohit Sharma becomes net bowler for Gujarat Titans. ఐపీఎల్ 2014 సీజన్ లో పర్పుల్ క్యాప్ ను సొంతం చేసుకున్న మోహిత్ శర్మ గురించి ఎవరూ మరచిపోలేరు.
By Medi Samrat Published on 21 March 2022 11:22 AM ISTఐపీఎల్ 2014 సీజన్ లో పర్పుల్ క్యాప్ ను సొంతం చేసుకున్న మోహిత్ శర్మ గురించి ఎవరూ మరచిపోలేరు. అలాంటి భారత మాజీ పేసర్ మోహిత్ శర్మను కొత్త ఐపీఎల్ ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ నెట్ బౌలర్‌గా నియమించుకున్నట్లు వార్తలు వెలువడిన తర్వాత క్రికెట్ అభిమానులు షాక్ అయ్యారు. ఫాస్ట్ బౌలర్ బరీందర్ స్రాన్ ను కూడా నెట్ బౌలర్ గా పెట్టుకుంది గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం. మార్చి 26న ప్రారంభమయ్యే కొత్త సీజన్ కోసం గుజరాత్ టైటాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తూ ఉంది.
చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన మోహిత్ శర్మ 2014 IPL సీజన్‌లో 16 మ్యాచ్‌లలో 19.65 సగటుతో 23 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. 33 ఏళ్ల శర్మ గత నెలలో జరిగిన IPL 2022 మెగా వేలంలో ఎవరూ తీసుకోలేదు. ఇప్పుడు అతడిని నెట్ బౌలర్ గా చేయడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
హర్యానా క్రికెటర్ కింగ్స్ XI పంజాబ్ (ఇప్పుడు పంజాబ్ కింగ్స్ 2016-2018)కి వెళ్లడానికి ముందు 2013-2015 మధ్య మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని CSKలో ఉన్నాడు. 2019లో తిరిగి CSK లోకి వచ్చాడు. 2020లో అతను ఢిల్లీ క్యాపిటల్స్ తరపున కూడా ఆడాడు. మొత్తం ఇప్పటి వరకూ 86 IPL మ్యాచ్ లలో 92 వికెట్లు సాధించాడు.
భారత్ తరపున 26 ODIలు, ఎనిమిది T20Iలు ఆడాడు శర్మ. బంగ్లాదేశ్‌లో జరిగిన 2014 ICC ప్రపంచ T20 ఫైనల్‌కు వెళ్లిన జట్టులోనూ, 2015 ప్రపంచ కప్ సెమీఫైనల్స్‌కు చేరిన భారత జట్టులో కూడా భాగంగా మోహిత్ శర్మ ఉన్నాడు. CSK రెండేళ్ల సస్పెన్షన్ తర్వాత శర్మ కెరీర్ గ్రాఫ్ తగ్గడం ప్రారంభమైంది. అతను KXIP కు ఎంపిక చేయబడినప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేదు. శర్మ 2019లో CSK కోసం సెలెక్ట్ అయినా 2014 మ్యాజిక్‌ను చూపించలేకపోయారు. 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున కూడా అతను ప్రభావం చూపలేదు, సీజన్‌లో కేవలం ఒక మ్యాచ్ మాత్రమే ఆడి 1/45 ప్రదర్శన చేశాడు. గుజరాత్ టైటాన్స్ మార్చి 28న ముంబైలోని వాంఖడే స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్‌తో తలపడి IPL 2022 సీజన్ ను ప్రారంభించనుంది.