పంజాబ్‌పై ఆర్సీబీ విక్టరీ.. ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుందా..?
ఐపీఎల్-2024 58వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడింది. ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది
By Medi Samrat Published on 10 May 2024 1:15 AM GMTఐపీఎల్-2024 58వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడింది. ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. అనంతరం పంజాబ్ జట్టు 17 ఓవర్లలో 181 పరుగులకే కుప్పకూలింది.
దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 60 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచింది. ఈ ఓటమితో పంజాబ్ జట్టుకు 12 మ్యాచ్‌ల తర్వాత ఎనిమిది పాయింట్లు ఉన్నాయి. ముంబై తర్వాత ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన రెండో జట్టు పంజాబ్. RCB ఈ విజయంతో ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. 12 మ్యాచ్‌ల తర్వాత ఆ జట్టుకు 10 పాయింట్లు ఉన్నాయి. ఒక జట్టు ప్లేఆఫ్ చేరుకోవాలంటే గరిష్టంగా 14 పాయింట్లు అవసరం అయినప్పటికీ.. వారు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడవలసి ఉంటుంది. బెంగళూరు తర్వాతి రెండు మ్యాచ్‌లు చిన్నస్వామి స్టేడియంలో జరగనున్నాయి. మే 12న ఢిల్లీ క్యాపిటల్స్‌తో, మే 18న చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆ జట్టు ఆడుతుంది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 47 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 92 పరుగులు చేశాడు. రజత్ పాటిదార్ 23 బంతుల్లో 55 పరుగులు, కామెరాన్ గ్రీన్ 27 బంతుల్లో 46 పరుగులు చేశారు. అనంతరం పంజాబ్ జట్టు 17 ఓవర్లలో 181 పరుగులకే కుప్పకూలింది. రిలే రూసో అత్యధికంగా 61 పరుగులు చేయగా.. శశాంక్ సింగ్ 37 పరుగులు, సామ్ కుర్రాన్ 22 పరుగులు చేయగలిగారు. సిరాజ్ మూడు వికెట్లు తీశాడు. స్వప్నిల్ సింగ్, లోకీ ఫెర్గూసన్, కర్ణ్ శర్మ చెరో రెండు వికెట్లు తీశారు.