సెంచరీల మోత మోగిస్తున్న పుజారా, పడిక్కల్, తిలక్..!
యువ ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్ ప్రస్తుత రంజీ సీజన్‌లో అద్భుతంగా ఆడుతున్నాడు.
By Medi Samrat Published on 10 Feb 2024 4:45 AM GMTయువ ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్ ప్రస్తుత రంజీ సీజన్‌లో అద్భుతంగా ఆడుతున్నాడు.ఈ సీజన్‌లో ఇప్పటికే రెండు సెంచరీలు చేసిన అతను.. తాజాగా మరో సెంచరీ బాదాడు. తమిళనాడుతో జరుగుతున్న మ్యాచ్‌లో పడిక్కల్ అజేయమైన సెంచరీతో (151; 12 ఫోర్లు, సిక్స్) చెలరేగాడు. ప్రస్తుత సీజన్ తొలి మ్యాచ్‌లో పంజాబ్‌పై శతక్కొట్టిన పడిక్కల్.. గోవాతో జరిగిన మ్యాచ్‌లో మరో సెంచరీ బాదాడు. తాజా సెంచరీతో ఈ ఏడాది ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో పడిక్కల్ చేసిన సెంచరీల సంఖ్య నాలుగుకు చేరింది. ఈ ఏడాది అతను ఆడిన 8 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలు కొట్టాడు. ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పడిక్కల్ ఇండియా-ఏ తరఫున సెంచరీ చేశాడు. ప్రస్తుత రంజీ సీజన్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన పడిక్కల్.. 82కు పైగా సగటున మూడు సెంచరీల సాయంతో 450కు పైగా పరుగులు చేశాడు. టీమిండియాలో చోటు కోసం ఎదురుచూస్తున్న బ్యాటర్లలో పడిక్కల్ కూడా ఒకడు.
తిలక్ వర్మ రంజీ ట్రోఫీ-2024లో రెండు సెంచరీలు చేయగా.. తాజాగా మరో సెంచరీ చేశాడు. ప్లేట్ గ్రూపు తొలి సెమీ ఫైనల్లో భాగంగా నాగాలాండ్‌తో మ్యాచ్‌లో.. హైదరాబాద్ కెప్టెన్ తిలక్ వర్మ 101 పరుగులతో సత్తా చాటాడు. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన తిలక్ వర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 135 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 101 రన్స్ చేశాడు.
రంజీ ట్రోఫీ 2024 సీజన్‌లో భారత వెటరన్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా ఓ డబుల్ సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు (8 ఇన్నింగ్స్‌ల్లో 76.86 సగటున 522 పరుగులు) చేశాడు. ఇక పుజారా రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మరో సెంచరీ బాదాడు. ఈ మ్యాచ్‌లో పుజారా 199 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో సెంచరీ మార్కును చేరుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో పుజారాకు ఇది 62వ శతకం. పుజారా రంజీల్లో తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ ఉండడంతో భారత జట్టులోకి తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి.
రాయ్‌పూర్‌లో చత్తీస్‌గఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఆటగాడు పృథ్వీ షా 159 పరుగులు సాధించాడు. మొదటి రోజు ముంబై ఆట ముగిసే సమయానికి 310/4కి చేరుకుంది.