PSL 2026 : ఇదేం రూల్..? ఇప్పటి వరకూ ఏ లీగ్‌లో చూడలేదు..!
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పిఎస్ఎల్) ప్రస్తుత సీజన్‌లో ఒక విభిన్నమైన పరిణామం చోటుచేసుకుంది.
By - Medi Samrat |
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పిఎస్ఎల్) ప్రస్తుత సీజన్‌లో ఒక విభిన్నమైన పరిణామం చోటుచేసుకుంది. పిఎస్ఎల్ 2026 శుక్రవారం ప్రారంభం కాగా.. ఈ లీగ్ తన మొదటి మ్యాచ్ నుంచే వార్తల్లో నిలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్లైన లాహోర్ ఖలందర్స్, హైదరాబాద్ కింగ్స్‌మెన్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఇరు జట్ల కెప్టెన్లు చెరో రెండు తుది జట్లను సమర్పించారు.
సాధారణంగా క్రికెట్ మ్యాచ్‌లలో టాస్‌కు ముందు కెప్టెన్లు మ్యాచ్ రిఫరీకి ఒకే ప్లేయింగ్-11 షీట్‌ను సమర్పిస్తారు. కానీ PSL మొదటి మ్యాచ్‌లో.. ఇద్దరు కెప్టెన్లు రెండు షీట్లను సమర్పించారు. లీగ్ కొత్త నిబంధనల కారణంగా ఇది జరిగింది.
నియమాల ప్రకారం.. రెండు జట్ల కెప్టెన్లు టాస్‌కు ముందు తమ రెండు తుది జట్లను ప్రకటించాలి. టాస్ తర్వాత వాటిలో ఒకదాన్ని మాత్రమే ఎంపిక చేయాలి. దీని అర్థం.. ఒక జట్టు సమర్పించిన రెండు జాబితాలలో టాస్ తర్వాత ఒకదానికి ఆమోదం లభిస్తుంది. ఆ జట్టు మ్యాచ్‌లో ఆడుతుంది.
ఆటగాళ్ల నామినేషన్లు, మార్పులకు సంబంధించిన నిబంధన 1.2.1 ప్రకారం.. మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల కెప్టెన్లు తమ రెండు తుది జట్లను సమర్పించాలి. టాస్ తర్వాత.. ఇద్దరు కెప్టెన్లు సమర్పించిన రెండు తుది జట్లలో ఒకదాన్ని ఎంచుకోవాలి. తుది జట్టును సమర్పించిన తర్వాత, ఇతర జట్టు కెప్టెన్ ఆమోదం లేకుండా దానిని మార్చడానికి వీలు లేదు. ప్రస్తుతం ఈ రూల్ తీవ్ర చర్చకు దారితీసింది.