వ‌ర‌ల్డ్ క‌ప్‌ ప్రైజ్ మనీని ప్రకటించిన ఐసీసీ.. విజేతకు రూ. 33.17 కోట్లు

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) త్వరలో జరగనున్న పురుషుల వన్డే ప్రపంచకప్‌కు

By Medi Samrat  Published on  22 Sep 2023 2:33 PM GMT
వ‌ర‌ల్డ్ క‌ప్‌ ప్రైజ్ మనీని ప్రకటించిన ఐసీసీ.. విజేతకు రూ. 33.17 కోట్లు

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) త్వరలో జరగనున్న పురుషుల వన్డే ప్రపంచకప్‌కు ప్రైజ్ మనీని ప్రకటించింది. టోర్నమెంట్ కోసం ఐసిసి ప్రైజ్ మనీని రూ.82.93 కోట్లు (US$10 మిలియన్లు)గా కేటాయించింది. ప్రపంచకప్‌కు భారత్‌ ఆతిథ్యం ఇస్తోంది. అక్టోబర్ 5న డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. నవంబర్ 19న టోర్నీ ఫైనల్ జరగనుంది. ఓపెనింగ్, ఫైనల్ మ్యాచ్‌లు రెండూ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్నాయి.

విజేత జట్టుకు రూ.33.17 కోట్లు (నాలుగు మిలియన్ అమెరికన్ డాలర్లు) అందజేస్తామని ఐసీసీ శుక్రవారం (సెప్టెంబర్ 22) తెలిపింది. ఫైనల్లో ఓడిన జట్టు రూ.16.59 కోట్లతో (రెండు మిలియన్ యూఎస్ డాలర్లు) సంతృప్తి చెందాల్సి ఉంటుంది. గ్రూప్ దశలో మొత్తం 10 జట్లు రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో ఒకదానితో ఒకటి ఆడతాయి. పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. 2019లో కూడా ఇదే ఫార్మాట్‌లో టోర్నీని నిర్వహించారు.

గ్రూప్ రౌండ్‌లో గెలిచిన మ్యాచ్‌లకు ప్రైజ్ మనీ కూడా ఇస్తారు. ఒక్కో విజయానికి జట్లకు రూ. 33.17 లక్షలు (US$40,000) అందుతాయి. గ్రూప్ దశ ముగిసే సమయానికి నాకౌట్‌కు చేరుకోవడంలో విఫలమైన జట్లకు ఒక్కొదానికి రూ. 82.92 లక్షలు (US$100,000) పొందుతాయి.

ఈ ప్రపంచకప్‌లో ట్రోఫీ కోసం 10 జట్లు పోటీపడనున్నాయి. ఆతిథ్య భారత్‌తో పాటు న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లు ఆడనున్నాయి. 10 జట్ల మధ్య మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు.. ప్రతి జట్టు 46 రోజుల టోర్నమెంట్‌కు సన్నద్ధం కావడానికి రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతుంది.

Next Story