అల్లు అర్జున్ నా ఫేవరేట్ హీరో అంటున్న మహిళా క్రికెటర్
Priya Puniya Says Allu Arjun is My Favourite Hero. టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తన ఫేవరేట్ సౌతిండియన్ హీరో
By Medi Samrat Published on 20 Nov 2020 7:17 AM GMT
టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తన ఫేవరేట్ సౌతిండియన్ హీరో అని భారత మహిళా క్రికెటర్ ప్రియా పునియా తెలిపింది. స్మృతి మంధాన తరహాలో అభిమానుల ఫాలోయింగ్‌ను అందుకున్న ఈ టాపార్డర్ బ్యాట్స్‌వుమెన్.. ఇటీవల ముగిసిన మహిళల టీ20 చాలెంజ్ టోర్నీలో పాల్గొంది. తన ఆటతీరుతో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. మైదానంలో తన హవాభావాలతో అభిమానుల మనసులను దోచుకుంది.
ఇక తన టీమ్ సూపర్ నోవాస్ ఫైనల్లో ఓడినప్పటికీ.. ప్రియా పూనియా సోషల్ మీడియా వేదికగా అభిమానులను అలరిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా 'Ask Me Anything' ద్వారా ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా తన ఇష్టాఇష్టాలను వారితో పంచుకుంది. అదే సమయంలో తనకు అల్లు అర్జున్ అంటే ఇష్టమని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పింది.
అలాగే.. 'నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా?' అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంది. ఈ ప్రశ్నకు ఓ వీడియోను సమాధానంగా ఇచ్చిన ప్రియా.. అందులో ఛీ ఛీ బాయ్ ఫ్రెండా? అనే తరహాలో ఫేస్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది.
ఇదిలావుంటే.. 2018లో భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన పూనియా.. ఇప్పటి వరకు భారత్ తరఫున 5 వన్డేలు, 3 టీ20లు ఆడింది.