వేలంలో అమ్ముడుపోనందుకు 'పృథ్వీ షా' సిగ్గుపడాలి.. డీసీ మాజీ కోచ్ ఆగ్రహం

ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ అసిస్టెంట్ కోచ్ మహ్మద్ కైఫ్ పృథ్వీ షాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

By Medi Samrat  Published on  26 Nov 2024 6:25 PM IST
వేలంలో అమ్ముడుపోనందుకు పృథ్వీ షా సిగ్గుపడాలి.. డీసీ మాజీ కోచ్ ఆగ్రహం

ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ అసిస్టెంట్ కోచ్ మహ్మద్ కైఫ్ పృథ్వీ షాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. జెడ్డాలో జరిగిన IPL 2025 మెగా వేలంలో పృథ్వీ షా తన బేస్ ధర రూ. 75 లక్షలకు కూడా అమ్ముడు పోలేదు. ఒకప్పుడు భారత క్రికెట్ భవిష్యత్తుగా భావించిన‌ పృథ్వీ షా.. గత కొంత కాలంగా గడ్డు ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్నాడు.

జియో సినిమాతో మాట్లాడిన కైఫ్.. మెగా వేలంలో రూ.75 ల‌క్ష‌ల‌కు కూడా కొనుగోలుదారుడు దొరకనందుకు పృథ్వీ షా సిగ్గుపడాలని అన్నారు. కైఫ్ ఢిల్లీ క్యాపిటల్స్‌లో తన కోచింగ్ రోజులను గుర్తుచేసుకున్నాడు. షాతో తన అనుభవాన్ని పంచుకున్నాడు. ప్లేయింగ్ 11లో అవకాశం రాకుంటే ఫిర్యాదు చేయని ఆటగాడు పృథ్వీ షా అని అన్నాడు. పృథ్వీ షాకు ఢిల్లీ క్యాపిటల్స్‌లో ఎప్పుడు ప్లేయింగ్‌ 11లో అవకాశాలు లభించాయని.. అయితే అతను జట్టులో శాశ్వత స్థానాన్ని పొందలేకపోయాడని అతను చెప్పాడు. పృథ్వీ షాకు ఢిల్లీ చాలా సపోర్ట్ చేసింది. DC అతను పవర్‌ప్లే ప్లేయర్ అని.. ఒక ఓవర్‌లో వరుసగా ఆరు ఫోర్లు కొట్టగలడని ఆశించింది. అలా చేసి కూడా చూపించాడు. శివమ్ మావి వేసిన ఓవర్లో షా వరుసగా ఆరు ఫోర్లు బాదాడు. DC అతనికి చాలా కాలం పాటు మద్దతు ఇచ్చింది. షా బ్యాట్ ఝుళిపిస్తే గెలుస్తామని మేం ఎప్పుడూ అనుకునేవాళ్లం. అతనికి చాలా అవకాశాలు ఇచ్చాం. రాత్రిపూట అనేక సమావేశాలు జరిగేవి.. ఓ స‌మావేశంలో పృథ్వీ ఆటతీరు ఆడతాడా లేదా అని చర్చించుకున్నాం. పృథ్వీని ప్లేయింగ్ 11లో ఉంచకూడదని నిర్ణయం తీసుకున్నాం.. కానీ మ్యాచ్ సమయంలో మేము నిర్ణయాన్ని మార్చుకున్నాం.. ఎందుకంటే అతను పెద్ద ఇన్నింగ్స్ ఆడితే మేము గెలుస్తామన్నాడు.

దేశవాళీ క్రికెట్‌లో పృథ్వీ షా కష్టపడి పనిచేయాలని కైఫ్ అన్నాడు. అతను తన ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలి. పరుగులు సాధించడంపై మాత్రమే దృష్టి పెట్టాలి. సర్ఫరాజ్ ఖాన్‌ను ఉదాహరణగా పేర్కొంటూ.. దేశవాళీ క్రికెట్‌లో నిరంతరం పరుగులు చేయడం ద్వారా తాను భారత జట్టులో చోటు సంపాదించాడ‌ని కైఫ్ చెప్పాడు.

పృథ్వీ షా కెరీర్ వివాదాలతో నిండిపోయింది. 2024లో ముంబైతో రంజీ ట్రోఫీని గెలుచుకున్న తర్వాత క్రమశిక్షణా కారణాల వల్ల జట్టు నుండి తొలగించబడ్డాడు. జట్టుకు దూరమైన‌ తర్వాత కూడా పృథ్వీ షా ప‌లు వివాదాల‌లో ఇరుక్కున్నాడు.

Next Story