'నాకు ఎవరి సానుభూతి అక్కర్లేదు.. ప్రశాంతంగా ఉన్నా'.. సెంచరీ తర్వాత పృథ్వీ షా

టీం ఇండియాకు దూరమైన పృథ్వీ షా దేశవాళీ క్రికెట్‌లో మహారాష్ట్ర త‌రుపున స‌రికొత్త శుభారంభం చేశాడు.

By Medi Samrat
Published on : 20 Aug 2025 10:58 AM IST

నాకు ఎవరి సానుభూతి అక్కర్లేదు.. ప్రశాంతంగా ఉన్నా.. సెంచరీ తర్వాత పృథ్వీ షా

టీం ఇండియాకు దూరమైన పృథ్వీ షా దేశవాళీ క్రికెట్‌లో మహారాష్ట్ర త‌రుపున స‌రికొత్త శుభారంభం చేశాడు. బుచ్చి బాబు ట్రోఫీ 2025 మ్యాచ్‌లో ఛత్తీస్‌గఢ్‌తో ఆడుతూ షా అద్భుతమైన సెంచరీని సాధించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన‌ ఛత్తీస్‌గఢ్ 242 పరుగులు చేయగా.. దానికి సమాధానంగా మహారాష్ట్ర కేవలం 217 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే.. వీటిలో 111 పరుగులు పృథ్వీ షా బ్యాట్ నుండి వచ్చాయి.. ఈ ఇన్నింగ్సుతో పృథ్వీ షా పెద్ద వేదికల‌పై పునరాగమనం చేయగల శక్తి తనకు ఇంకా ఉందని నిరూపించాడు.

గత కొన్ని నెల‌లుగా క్రమశిక్షణ, ఫిట్‌నెస్‌కు సంబంధించిన వివాదాలతో షా పేరు ముడిపడి ఉంది. ఒకప్పుడు భారత క్రికెట్ భవిష్యత్తు అని పిలుచుకున్న ఈ బ్యాట్స్‌మెన్.. చాలా కాలం పాటు టీమ్ ఇండియాకు దూరంగా ఉండాల్సి వచ్చింది.. అయితే ఈ 25 ఏళ్ల బ్యాట్స్‌మెన్ క్రికెట్‌లో మ‌ళ్లీ మెరుస్తాడని ఈ ఇన్నింగ్స్ చూపించింది.

సెంచరీ తర్వాత పృథ్వీ షా మాట్లాడుతూ.. "మళ్లీ మొదటి నుంచి ప్రారంభించేందుకు నాకు ఎలాంటి సంకోచం లేదు. నేను జీవితంలో చాలా ఎత్తుపల్లాలు చూశాను. నేను ఎప్పుడూ నా మ‌న‌సాక్షిని, నా కష్టాన్ని నమ్ముతాను. ఈ సీజన్ నాకు, నా జట్టుకు మంచి జ‌రుగుతుందని ఆశిస్తున్నాను."

బుచ్చి బాబు టోర్నీతో బలమైన పునరాగమనం చేసిన తర్వాత ఈ ఇన్నింగ్స్ వెనుక ఉన్న మార్పు ఏమిటని అడగ‌గా షా బ‌దులిస్తూ.. తాను పెద్దగా ఏమీ స్టైల్‌ మార్చలేదని.. కేవలం చిన్న మెరుగుదలలు మాత్రమే చేశానని.. అండర్-19 రోజులలో నేను క‌ష్ట‌ప‌డిన విధంగానే నేను ప‌ని చేయడం ప్రారంభించానని చెప్పాడు. నెట్స్ ప్రాక్టీస్, జిమ్, రన్నింగ్. ఇవి చిన్న విషయాలు, కానీ అవి తేడా తీసుకొస్తాయ‌న్నాడు. ప్ర‌స్తుత‌మున్న రోజుల్లో సోషల్ మీడియా చెడ్డది.. దానికి దూరంగా ఉండటం వల్ల నేను మరింత ప్రశాంతంగా ఉన్నానని పేర్కొన్నాడు.

షా సెంచరీ ప‌ట్ల‌ మాజీ ఆటగాళ్లు లేదా సహచరుల‌ నుండి అభినందనలు అందుకున్నారా అని అడగ‌గా.. షా మాట్లాడుతూ.. లేదు, నాకు ఎవరి సానుభూతి అక్కర్లేదు. నా కుటుంబం, స్నేహితులు నాతో ఉన్నారు. నేను మానసికంగా బాగోలేనప్పుడు కూడా నాకు అండగా నిలిచారని బదులిచ్చాడు.

Next Story