ఇంగ్లాండ్‌తో రెండో టీ20.. కోహ్లీ మీదే కళ్లన్నీ
Pressure on Virat Kohli as India Eye Series Win at Edgbaston.మూడు టి20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో అదరగొట్టిన
By తోట వంశీ కుమార్ Published on 9 July 2022 4:28 AM GMTమూడు టి20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో అదరగొట్టిన టీమ్ఇండియా నేడు జరిగే రెండో టి20లోనూ మరోసారి అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని భావిస్తోండగా.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్ సమం చేయాలని ఇంగ్లాండ్ గట్టి పట్టుదలతో ఉంది. దీంతో నేటి మ్యాచ్‌లో ఇరు జట్లు హోరా హోరీగా తలపడం ఖాయం.
తొలి మ్యాచ్‌లో అంతగా అనుభవం లేని జట్టుతో ఇంగ్లాండ్‌కు షాకిచ్చింది టీమ్ఇండియా. ఇప్పుడు అదే జోరులో సిరీస్ పట్టేయాలని చూస్తోంది. తొలి మ్యాచ్‌కు అందుబాటులో లేని కోహ్లీ, పంత్, జడేజా, బుమ్రా రాకతో భారత జట్టు మరింత పటిష్టంగా కనిపిస్తుంది. వీరిలో కోహ్లీ పైనే ప్రధానంగా అందరి దృష్టి నెలకొని ఉంది. గత రెండేళ్లుగా ఏ ఫార్మాట్‌లోనూ ఈ పరుగుల యంత్రం సెంచరీ చేయలేదు. పైగా ఇటీవల కాలంలో కోహ్లీ ఆటతీరు మరింత తీసికట్టుగా మారింది.
ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి టెస్టులోనూ రెండు ఇన్నింగ్స్‌లో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. దీపక్ హుడా, ఇషాన్ కిషన్ లాంటి కుర్రాళ్లు అదగొడుతుండడం, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య లు పూర్వపు ఫామ్ అందుకుని జట్టులో కుదురుకోవడంతో కోహ్లీ కి కష్టాలు తప్పేలా లేవు. ఇప్పటికే పొట్టి ఫార్మాట్‌లో కోహ్లీని తప్పించాలని పలువురు మాజీ క్రికెటర్లు బహిరంగంగానే చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ సిరీస్‌లో కోహ్లీ కనుక రాణించకుంటే.. ఈ ఫార్మాట్‌లో కోహ్లికి ఇదే చివరి సిరీస్ అయ్యే అవకాశం ఉంది.
పంత్, జడేజా, బుమ్రా, కోహ్లీలు ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి రాగా.. అందరిని తుది జట్టులో ఆడిస్తారా..? లేదా అన్న ప్రశ్న మొదలైంది. ఐర్లాండ్‌తో రెండు టీ20లు, ఇంగ్లాండ్‌తో తొలి టి20లో కోహ్లీ ఆడే మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన దీపక్ హుడా అదరగొట్టాడు. ప్రస్తుతం అతడు మంచి ఫామ్‌లో ఉన్నాడు. దీంతో అతడిని తప్పిస్తారా..? లేదా అన్నది తెలియాల్సి ఉంది. సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడాలలో ఒకరికి మాత్రమే తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. పంత్ కోసం దినేశ్ కార్తిక్ లేదా ఇషాన్ కిషన్‌లలో ఒకరిపై వేటు తప్పదు. ఇషాన్‌ను తప్పిస్తే కోహ్లీ ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడు. ఇక అర్ష్‌దీప్ స్థానంలో బుమ్రా ఆడనున్నాడు. అక్షర్ స్థానంలో జడేజాను ఎంపిక చేస్తారా..? లేక అదనంగా మరో బ్యాట్స్‌మెన్‌ను తీసుకోవాలా..? అన్న ఆలోచనలో టీమ్ మేనేజ్‌మెంట్ ఉంది.
ఇంగ్లాండ్ బ్యాటింగ్ బలగాన్ని చూస్తే గత మ్యాచ్‌లో 199 పరుగుల లక్ష్యం చిన్నదే అనిపించింది. అయితే దూకుడుగా ఆడబోయి ప్రధాన బ్యాటర్లంతా ఆరంభంలోనే వెనుదిరగడం ఆ జట్టును దెబ్బ తీసింది. ఈసారి అలాంటి అవకాశం ఇవ్వరాదని ఇంగ్లీష్ జట్టు భావిస్తోంది. ఓపెనర్లు బట్లర్, రాయ్ శుభారంభం అందిస్తే మలాన్, లివింగ్‌స్టోన్, అలీ అదే ధాటిని కొనసాగించగలరు. తొలి టీ20లో ఇంగ్లాండ్ బౌలర్లు తేలిపోయారు కాబట్టి బౌలింగ్‌లో ఒకటి లేదా రెండు మార్పులు చేసే అవకాశం ఉంది.